గురూజీ వదిలేసినా? పోటీకి మాత్రం సై!
అక్టోబర్ 9న మొదలు కానున్న పోటీలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో? ప్రేక్షకులు ఎవరికి బ్రహ్మరథం పడతారో.
By: Srikanth Kontham | 3 Oct 2026 6:28 PM ISTటాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. హిందీలో సంచలన విజయం సాధించి 400 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తున్న భక్తిభరిత చిత్రం `హనుమాన్ అంశ్` తెలుగు అనువాద హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమాను త్రివిక్రమ్ భాగస్వామ్యంతో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ విడుదల చేయాలనుకున్నా? కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాధ్యతలను పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తన చేతిలోకి తీసుకుంది.
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో నీమ్ కరోలి బాబా జీవిత ఇతివృత్తంగా తెరకెక్కిన `హనుమాన్ అంశ్` నార్త్ మార్కెట్లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు వెర్షన్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ బిజినెస్ - సంస్థల మార్పుల కంటే ఇప్పుడు అందరి దృష్టి అక్టోబర్ 9న జరగబోయే థియేట్రికల్ క్లాష్ మీదే నిలిచింది.
ఒకే తేదీకి `హనుమాన్ అంశ్`తో పాటు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన `ఆదర్శ కుటుంబం` కూడా బరిలో నిలుస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఒకప్పుడు ఈ సినిమాతో భాగం కావాలనుకున్న త్రివిక్రమ్ వర్గాలు తప్పుకోవడం.. సరిగ్గా అదే రోజు ఆయనకు సంబంధించిన మరో సినిమా బరిలో ఉండటంతో క్లాష్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా రంగంలో ఇలాంటి పోటీలు కొత్తేమీ కాదు. కానీ హోంబలే సంస్థ వంటి దిగ్గజ బేనర్ ద్వారా వస్తోన్న డబ్బింగ్ సినిమాకు తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
కంటెంట్ బలముంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనేందుకు గతేడాది వచ్చిన చిత్రాలే నిదర్శనం. పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా? సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమనే ధీమాతో చిత్ర యూనిట్ ఉంది. మొత్తానికి త్రివిక్రమ్ చేతుల నుంచి హోంబలే సంస్థ చేతికి మారిన సినిమా ప్రయాణం బాక్సాఫీస్ వార్ వరకు వచ్చి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్ 9న మొదలు కానున్న పోటీలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో? ప్రేక్షకులు ఎవరికి బ్రహ్మరథం పడతారో. చూడాలి.
