సక్సెస్ వచ్చిన తర్వాతే గుర్తించడం కరెక్టేనా?
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఓ చిన్న సినిమా.. ఇప్పుడు బాలీవుడ్ లోనే హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 5 Sept 2026 9:22 AM ISTఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఓ చిన్న సినిమా.. ఇప్పుడు బాలీవుడ్ లోనే హాట్ టాపిక్ గా మారింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఆ సక్సెస్ వెనుక తనకు ఎదురైన అనుభవాలను దర్శకుడు విశాల్ చతుర్వేది ఇప్పుడు బయటపెట్టారు. సినిమా విడుదలకు ముందు సాయం కోసం సంప్రదించిన కొందరు బాలీవుడ్ ప్రముఖులు పట్టించుకోలేదని, ఇప్పుడు సినిమా సక్సెస్ కావడంతో వారే ఫోన్ చేసి అభినందిస్తున్నారని చెప్పారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలీ బాబా జీవిత విశేషాలు, ఆయన బోధనల ఆధారంగా హనుమాన్ అంశ్ తెరకెక్కింది. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ సినిమా తొలి రోజు రూ.10 లక్షల వసూళ్లతో ప్రారంభమైంది. అంతేకాదు.. భారీ చిత్రాల కోసం ఆ సినిమాకు కేటాయించిన షోలను కూడా భారీగా తగ్గించారు. ఏకంగా 250 షోల నుంచి కేవలం 25 షోలకు పరిమితమైంది. మల్టీప్లెక్సుల నుంచి పెద్దగా స్పందన లేకపోయినా ప్రేక్షకుల మౌత్ టాక్ సినిమాకు బలంగా మారింది.
సినిమా చూసిన వారు తమ ఎక్స్పీరియన్స్ ను ఇతరులతో షేర్ చేసుకోవడంతో క్రమంగా థియేటర్లలో ఆదరణ పెరిగింది. ఫలితంగా తొలిరోజు రూ.10 లక్షలతో మొదలైన వసూళ్లు భారీ స్థాయికి చేరాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆ సినిమా దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రిలీజైన నాలుగో వారం కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సినిమా విడుదలకు ముందు తనను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆయన అన్నారు. సాయం కోరిన సమయంలో కొందరు ముఖం చాటేశారని, ఇలాంటి కంటెంట్ తో సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరించరనే అభిప్రాయాలను వ్యక్తం చేశారని తెలిపారు. కానీ సినిమా సక్సెస్ అయ్యి, వసూళ్లు రావడం మొదలైన తర్వాత అదే వ్యక్తులు ఫోన్ చేసి అభినందించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు.
సినిమాపై నిజమైన నమ్మకంతో పనిచేసేవారు కొందరైతే.. బిజినెస్ యాంగిల్ లో మాత్రమే సినిమాలను చూసేవారు మరికొందరున్నారని విశాల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులకు నచ్చుతుందనే విషయంలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ కొంత అయోమయం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే సినిమా విజయాన్ని గుర్తించిన ప్రముఖులూ ఉన్నారు. దర్శకుడు మధుర్ భండార్కర్ ముందుగానే సినిమాను ప్రశంసించారని విశాల్ తెలిపారు. అలాగే నటి, ఎంపీ కంగనా రనౌత్ కూడా హనుమాన్ అంశ్ ను ప్రశంసించారు.
ఏదేమైనా భారీ ప్రమోషన్లు, స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ లేకపోయినా కంటెంట్ పై ప్రేక్షకులకు నమ్మకం కలిగితే చిన్న సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించగలదని హనుమాన్ అంశ్ నిరూపించింది. అదే సమయంలో సక్సెస్ వచ్చిన తర్వాతే గుర్తింపు ఇవ్వడం సరైనదేనా? అనే ప్రశ్నను దర్శకుడు విశాల్ వ్యాఖ్యలు మరోసారి ముందుకు తెచ్చాయి. సినిమా సక్సెస్ తో ఇప్పటికే సీక్వెల్ ను కూడా ప్రకటించిన మూవీ టీమ్.. రెండో పార్ట్ తో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో వేచి చూడాలి.
