పబ్లిసిటీ కోసం బడ్జెట్ తక్కువ చేసి చెప్తున్నారా?
చిత్ర యూనిట్ సభ్యులు సైతం సినిమాను పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయకుండానే సైలెంట్‌గా విడుదల చేయడం జరిగింది. విడుదల తర్వాత సినిమా మెల్ల మెల్లగా బాక్సాఫీస్ వద్ద సందడి మొదలు పెట్టింది.
By: Ramesh Palla | 1 Sept 2026 10:59 AM ISTబాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా 'హనుమాన్ అంశ్' అనే సినిమా గురించి చర్చ జరుగుతోంది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నీమ్ కరోలి బాబాకు భక్తులు ఉన్నారు. యాపిల్ అధినేత స్టీవ్ జాబ్స్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రపంచ ప్రసిద్ది గాంచిన ప్రముఖులు సైతం నీమ్ కరోలి బాబా భక్తులుగా ప్రచారం ఉంది. అలాంటి నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా విడుదల సమయంలో పెద్దగా హడావుడి లేదు. చిత్ర యూనిట్ సభ్యులు సైతం సినిమాను పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయకుండానే సైలెంట్‌గా విడుదల చేయడం జరిగింది. విడుదల తర్వాత సినిమా మెల్ల మెల్లగా బాక్సాఫీస్ వద్ద సందడి మొదలు పెట్టింది.
హనుమాన్ అంశ్ మూవీ రిలీజ్ డేట్...
ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజు కేవలం రూ.10 లక్షల వసూళ్లు మాత్రమే నమోదు అయినట్లు బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ కారణంగా రోజు రోజుకు వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. మూడు వారాల్లో సినిమా దాదాపు రూ.60 కోట్ల వసూళ్లు సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే సినిమాను కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఈ కాలంలో రెండు కోట్ల రూపాయలతో సినిమా తీయడం సాధ్యమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అది కూడా పీరియాడిక్ మూవీ అంటే చాలా సందేహాలు కలుగుతున్నాయి. పెరిగిన నటీనటుల పారితోషికాలు, సాంకేతిక నిపుణులు జీతాలు సినిమా బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో కూడా ఒకరు ఇద్దరు కాకుండా చాలా మంది నటీనటులు ఉన్నారు. ఫేమస్ కాకున్నా వారికి కూడా కొంత మొత్తంలో అయినా పారితోషికాలు ఇవ్వాల్సిందే.
బాలీవుడ్ మూవీ హనుమాన్ అంశ్ వసూళ్లు...
సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుందని రివ్యూలు వచ్చాయి. కథను 1913 కాలంలో ప్రారంభించడం జరగుతుంది. అందుకు తగ్గట్లుగా సెట్స్, ఆ కాలం నాటి రైలు, పరిసరాలను క్రియేట్ చేయడానికి కచ్చితంగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. లక్షల కొద్ది సెట్స్ కి ఖర్చు చేసి ఉంటారని, అంతే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానం కోసం కూడా లక్షల్లో ఖర్చు చేసి ఉంటారు. ఇక నటీనటుల, సాంకేతిక నిపుణుల పారితోషికాలు కనీసం కోటి వరకు అయ్యి ఉంటాయని అంటున్నారు. సినిమాలో పెద్దగా హడావిడి లేదు, అలాగే గ్రాఫిక్స్ కూడా లేవు. కనుక లో బడ్జెట్ మూవీగానే తెలుస్తుంది. కానీ మరీ రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించారు అంటే నమ్మశక్యంగా లేదని పలువురు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం సినిమా బడ్జెట్ తక్కువ చేసి చెబుతున్నారా అంటూ కొందరు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు.
నీమ్ కరోలి బాబా పై వచ్చిన సినిమా బడ్జెట్..
హనుమాన్ అంశ్ సినిమా కచ్చితంగా మంచి సినిమా, ఒక బాలుడు చిన్నప్పటి నుంచి పడిన మానసిక ఆవేదనను చక్కగా చూపించి, అతడి ఎదుగుదలను ఆకట్టుకునే విధంగా చూపించడంలో దర్శకుడు విశాల్ చతుర్వేది పూర్తిగా సఫలం అయ్యాడు. నీమ్ కరోలి బాబా పై తనకు ఉన్న భక్తి, గౌరవం, అభిమానంతో విశాల్ చతుర్వేది ఈ సినిమాను రూపొందించాడు. సినిమాలో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా స్క్రీన్‌ప్లే, రచన సైతం విశాల్ చతుర్వేది కావడం విశేషం. ఒక కొత్త దర్శకుడు ఇంత సింపుల్‌గా ఒక సినిమాను, ఎక్కడ బోర్ కొట్టకుండా రూపొందించడం అనేది సాధారణ విషయం కాదు అంటూ రివ్యూలు వస్తున్నాయి. అయితే బడ్జెట్ విషయంలోనే నలుగురు నాలుగు రకాలుగా అంటున్నారు. ఈ సినిమాకు ప్రస్తుత పరిస్థితుల్లో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య బడ్జెట్ అయ్యి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. నిజంగానే ఈ సినిమాను రూ.2 కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు విశాల్ చతుర్వేది పూర్తి చేసి ఉంటే కచ్చితంగా ఆయన ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్‌కి ఆదర్శం అనడంలో సందేహం లేదు.
