లెక్కలనే క్వశ్చన్ చేస్తున్న హనుమాన్ అంశ్.. ధైర్యం ఇచ్చినట్లేనా..
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల ఆధారంగా తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.
By: M Prashanth | 5 Sept 2026 5:00 AM ISTసినిమా హిట్ కావాలంటే భారీ బడ్జెట్.. స్టార్ హీరో.. పెద్ద నిర్మాణ సంస్థ.. భారీ ప్రమోషన్స్ ఉండాలనే అభిప్రాయం సాధారణంగా ఉంటుంది. కానీ, ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఓ చిన్న సినిమా ఆ లెక్కలన్నింటినీ ప్రశ్నిస్తోంది. భారీ అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ అంశ్.. ప్రేక్షకుల సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు కారణమవుతోంది.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల ఆధారంగా తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఆధ్యాత్మిక అంశాన్ని కథగా ఎంచుకోవడం ఒక సవాలే. అందులోనూ భారీ బడ్జెట్ లేకుండా ఇలాంటి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరో ప్రయోగం. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాకు ప్రారంభంలో పెద్దగా హైప్ కనిపించలేదు.
అంతేకాదు.. పెద్ద సినిమాల రాకతో ఆ చిత్రానికి కేటాయించిన షోలు కూడా భారీగా తగ్గిపోయాయి. 250 షోల నుంచి కేవలం 25 షోలకు పరిమితమైన పరిస్థితి కనిపించింది. సినిమాకు పెద్దగా స్క్రీన్స్ లేకపోయినా.. చూసిన ప్రేక్షకులు మాత్రం పాజిటివ్ గా స్పందించారు. ఇదే మౌత్ టాక్ గా మారింది. ఒకరు చూసి మరొకరికి చెప్పడం.. వాళ్లు థియేటర్ కు వెళ్లడం.. అక్కడి నుంచి ఇంకొంత మందికి సినిమా గురించి చెప్పడం.. ఇలా హనుమాన్ అంశ్ జర్నీ వేగం అందుకుంది. ఇక్కడే చిన్న సినిమాలకు ఉన్న అసలు బలం మరోసారి బయటపడింది.
విడుదలకు ముందు ఎంత ప్రమోట్ చేసినా ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత ఇచ్చే రెస్పాన్సే మెయిన్. హనుమాన్ అంశ్ విషయంలో అదే జరిగింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధించడం సాధారణంగా కనిపిస్తోంది. పెద్ద బడ్జెట్ సినిమాలకు వందలాది స్క్రీన్స్, భారీ ప్రమోషన్స్ ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చిన్న బడ్జెట్ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం అంత ఈజీ కాదు. హనుమాన్ అంశ్ జర్నీ మాత్రం కంటెంట్ మీద నమ్మకంతో సినిమాను విడుదల చేసే నిర్మాతలకు ఒక ఉదాహరణగా మారుతోంది.
ముఖ్యంగా ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కథలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉందనే విషయం మరోసారి చర్చకు వచ్చింది. హిందీ మార్కెట్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రెస్పాన్స్ పెరిగినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్, భక్తులు సినిమాను ఆదరించడం కలిసొచ్చిన అంశంగా మారింది. హనుమాన్ అంశ్ విజయం ఇప్పుడు ఒక సినిమాకు సంబంధించిన అంశంగా మాత్రమే కాకుండా.. చిన్న చిత్రాల మార్కెట్ పై చర్చకు దారితీస్తోంది.
భారీ బడ్జెట్ పెట్టకుండా, విభిన్నమైన కథలను నమ్ముకుని సినిమాలు తీసేవారికి ఇలాంటి విజయాలు మరింత ధైర్యాన్ని ఇస్తాయి. అయితే ప్రతి చిన్న సినిమా ఇదే స్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పలేం. కానీ ప్రేక్షకులకు నచ్చే కథ, సరైన మౌత్ టాక్ ఉంటే.. అంచనాలకు మించి సినిమా జర్నీ సాగొచ్చని హనుమాన్ అంశ్ మూవీ చూపిస్తోంది.
