2 కోట్ల బడ్జెట్ 150కోట్ల వసూల్.. హనుమాన్ కాదు `హనుమాన్ అంశ`తో తీసినా జయమే!
నేడు అదే కోవలో కేవలం హనుమంతుడి పాత్రే కాదు.. ఆయన అంశతో పుట్టిన దివ్యమైన కథాంశంతో వచ్చిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయని `హనుమాన్ అంశ్` నిరూపించింది.
By: Sivaji Kontham | 8 Sept 2026 2:34 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో హనుమంతుడి కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ, క్రేజ్ ఉంటాయి. మనదేశపు మొట్టమొదటి సూపర్‌మేన్ అయిన ఆ ఆంజనేయుడి శక్తి, భక్తి నేపథ్యంతో ఏ సినిమా వచ్చినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన `హను-మాన్` చిత్రం నేటితరం ప్రేక్షకులను మైమరపించి.. స్టార్‌డమ్‌తో పని లేకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు సాధించడమే ఇందుకు నిదర్శనం. నేడు అదే కోవలో కేవలం హనుమంతుడి పాత్రే కాదు.. ఆయన అంశతో పుట్టిన దివ్యమైన కథాంశంతో వచ్చిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయని `హనుమాన్ అంశ్` నిరూపించింది.
డాక్టర్ విశాల్ చతుర్వేది రాసిన `డివైన్ డిటూర్` పుస్తకం ఆధారంగా నిర్మించిన `హనుమాన్ అంశ్` చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వ భారతదేశంలో లక్ష్మీ నారాయణ్ అనే యువకుడు ఆధ్యాత్మిక అన్వేషణలో ఉత్తర భారతదేశం వైపు పయనించి.. ఆ తర్వాత కాలంలో ప్రసిద్ధ హనుమద్భక్తుడైన `నీమ్ కరోలీ బాబా`గా ఎలా మారారనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. శోభినావ్ సత్య, చందన్ ఆనంద్ తమ అద్భుత నటనతో ఈ బయోపిక్ డ్రామాను ఎంతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కేవలం రూ. 2 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఏకధాటిగా 31 రోజులు పూర్తయినా బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
మొదటి వారం కేవలం రూ. 1.08 కోట్ల వసూళ్లతో అత్యంత తక్కువ స్క్రీన్లలో ప్రారంభమైన ఈ సినిమా.. కేవలం మౌత్ టాక్ తో ఊహించని రీతిలో పుంజుకుంది. 31వ రోజున (ఐదో ఆదివారం) ఏకంగా రూ. 22.75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి.. 37.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒక్క ఐదో వారాంతంలోనే ఏకంగా రూ. 49 కోట్లకు పైగా వసూలు చేసిహిందీ బాక్సాఫీస్ చరిత్రలోనే ఐదో వారంలో `ధురంధర్-2`, `పుష్ప-2` వంటి భారీ చిత్రాల కలెక్షన్ రికార్డులను సైతం తుడిచిపెట్టేసింది. 31వ రోజు నాటికి ఈ చిత్రం భారత్‌లో మొత్తం రూ. 122.13 కోట్ల నెట్ (రూ. 144.40 కోట్ల గ్రాస్) కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది.
ఉత్తరాదిన ఈ సినిమా ఇంతటి మహత్తర విజయాన్ని సాధించడానికి కారణం అక్కడి ప్రజలకు నీమ్ కరోలీ బాబాపై ఉన్న అపారమైన విశ్వాసమే కాకుండా... సినిమాలోని స్వచ్ఛమైన ఆధ్యాత్మిక భావోద్వేగాలే. ఆడియన్స్‌కు కావలసిన భక్తి రసాన్ని ఎక్కడా ఆర్భాటం లేకుండా నిజాయితీగా తెరపై ఆవిష్కరించడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. భక్తి, ఆధ్యాత్మికత- మానవీయ విలువలకు సరిహద్దులు ఉండవు కాబట్టి ఉత్తరాదిలో లభించినట్లే ఈ సినిమాలోని భావోద్వేగం దక్షిణాది ప్రేక్షకులకు కూడా కచ్చితంగా కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
భారతీయ సినీ చరిత్రను గమనిస్తే హనుమంతుడి విశ్వాసాన్ని... ఆంజనేయుడి శక్తిని ప్రామాణికంగా తీసుకుని వచ్చిన ప్రతి సినిమా అసాధారణ విజయాలనే సాధించింది. నేడు వస్తున్న ఈ తరహా కథలు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా మన సంస్కృతిని, ఆధ్యాత్మిక మూలాలను నేటి తరానికి చాటిచెబుతున్నాయి. `హను-మాన్` అందించిన స్ఫూర్తితో పాటు.. ఇప్పుడు `హనుమాన్ అంశ్` సాధించిన ఈ అద్భుత విజయం మునుముందు రోజుల్లో హనుమంతుడి కాన్సెప్ట్‌తో తెరకెక్కే మరిన్ని సరికొత్త చిత్రాలకు గొప్ప బాటలు పరిచిందని చెప్పవచ్చు.
