రూ.2 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ చేతికి వచ్చేసరికి రూ.200 కోట్లు!
జాబ్స్ జీవితంపై ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రభావం చూపిందనే విషయం చదివిన అనుప్రియకు అక్కడి నుంచే నీమ్ కరోలీ బాబాపై ఆసక్తి మొదలైంది.
By: M Prashanth | 12 Sept 2026 10:31 AM ISTహనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ అనౌన్స్‌మెంట్ చూస్తే ప్లాన్ పెద్దగానే ఉన్నట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఈ సినిమా పరిస్థితి పూర్తిగా వేరు. దాదాపు రూ.2 కోట్లలో తీసిన ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ.10 లక్షల దగ్గరే ఆగింది. మొదటి వారం మొత్తం కలిపినా రూ.1.08 కోట్లే వచ్చింది. ఇలాంటి ఓపెనింగ్ చూసినప్పుడు సినిమా ఇంత దూరం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
అసలు ఈ సినిమా వెనుక ఉన్న అనుప్రియ నగర్ వయసు 21 ఏళ్లు మాత్రమే. యూకేలో ఎకనామిక్స్ చదువుతూ మూడు సంవత్సరాలు పార్ట్ టైమ్ జాబ్స్ చేసి దాచుకున్న డబ్బును ఈ ప్రాజెక్ట్‌లో పెట్టింది. సినిమా రంగంలో ముందుగా అనుభవం కూడా లేదు. జ్యూరిచ్‌లో ఉద్యోగం కూడా వచ్చినా, 2025లో ఇండియాకు వచ్చి నీమ్ కరోలీ బాబా కథతో సినిమా చేయడంలో భాగమైంది.
అనుప్రియకు నీమ్ కరోలీ బాబా గురించి ఆసక్తి రావడానికి స్టీవ్ జాబ్స్ కూడా ఒక కారణం. జాబ్స్ జీవితంపై ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రభావం చూపిందనే విషయం చదివిన అనుప్రియకు అక్కడి నుంచే నీమ్ కరోలీ బాబాపై ఆసక్తి మొదలైంది. చదువులో భాగంగా ఆయన గురించి తెలుసుకుంటూ చివరకు బాబా జీవితంపై మరింత సమాచారం సేకరించింది. ఆ తర్వాత విశాల్ చతుర్వేది దర్శకత్వంలో హనుమాన్ అంశ్ రూపుదిద్దుకుంది. పెద్ద స్టార్లు, భారీ సెట్లు, పెద్ద ప్రమోషన్లు లేకుండానే సినిమా ఆగస్టు 7న హిందీలో విడుదలైంది. మొదట కేవలం 25 స్క్రీన్స్‌తో మొదలైన రన్, తర్వాత ప్రేక్షకుల టాక్‌తో దేశవ్యాప్తంగా వేల షోల వరకు పెరిగింది.
మొదటి రెండు వారాలు కలెక్షన్స్ చాలా నెమ్మదిగానే వెళ్లాయి. కానీ మూడో, నాలుగో వారానికి పరిస్థితి మారిపోయింది. షోలు పెరిగాయి, వసూళ్లు కూడా ఒక్కసారిగా జంప్ అయ్యాయి. సెప్టెంబర్ 11 నాటికి ఇండియాలో రూ.193 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఇప్పుడు రూ.200 కోట్ల మార్క్ కూడా దాటింది. ఓవర్సీస్ రిలీజ్ కూడా ఈ వారమే మొదలైంది. రెండు కోట్ల బడ్జెట్‌తో మొదలైన సినిమా నెల రోజుల్లోనే వంద రెట్లు రేంజ్‌కు వెళ్లడం వల్లే తెలుగు ఇండస్ట్రీ ఫోకస్ కూడా దీనిపై పడింది.
ఇప్పుడు హనుమాన్ అంశ్ సెప్టెంబర్ 18న తెలుగులో విడుదల కానుంది. త్రివిక్రమ్ సమర్పణలో, సాయి సౌజన్య నేతృత్వంలోని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. హిందీలో ఇప్పటికే భారీ రన్ చూసిన తర్వాత తెలుగు వెర్షన్ రావడం వల్ల ఇక్కడ మొదటి రోజు నుంచే సినిమాకు గుర్తింపు దొరికే ఛాన్స్ ఉంది.
మరో వైపు హనుమాన్ అంశ్‌ను మరో లెవెల్ కు తీసుకు వెళ్లాలని చూస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే దీన్ని ట్రైలజీగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. రెండో భాగంపై పని మొదలుపెట్టే ముందు కొంత గ్యాప్ తీసుకుంటామని నిర్మాతలు చెప్పారు. యూకేలో పార్ట్ టైమ్ జాబ్స్ చేసి దాచుకున్న డబ్బుతో మొదలైన అనుప్రియ ప్రయాణం, ఇప్పుడు త్రివిక్రమ్ సమర్పణలో తెలుగు రిలీజ్ వరకు వచ్చేసింది. ఇక తెలుగులో ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.
