హనుమాన్ అంశ 2లో అక్షయ్ కుమార్ నటిస్తున్నారా?
`హనుమాన్ అంశ` తొలి భాగం సాధించిన సంచల విజయం తర్వాత మేకర్స్ సీక్వెల్‌గా `హనుమాన్ అంశ 2` తెరకెక్కించనున్నట్లు ప్రకటించడంతో సినీ ప్రియులలో ఆసక్తి నెలకొంది.
By: Srikanth Kontham | 30 Sept 2026 6:00 AM IST`హనుమాన్ అంశ` తొలి భాగం సాధించిన సంచల విజయం తర్వాత మేకర్స్ సీక్వెల్‌గా `హనుమాన్ అంశ 2` తెరకెక్కించనున్నట్లు ప్రకటించడంతో సినీ ప్రియులలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ `హనుమాన్ అంశ 2` లో కీలకమైన పాత్రలో నటించబోతున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు ఊపందుకున్నాయి. అక్కి రాకతో సీక్వెల్ స్కేల్ మరింత పెరుగుతుందంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది. గతంలో `ఓ మై గాడ్` వంటి ఆధ్యాత్మిక, సామాజిక ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందిన అక్షయ్ కుమార్ ప్రాజెక్ట్‌లో చేరనున్నారనే వార్త వినగానే అభిమానులు నిజమేనని భావించారు.
అయితే `హనుమాన్ అంశ 2`లో అక్షయ్ కుమార్ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. ఇవి కేవలం సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన ఊహాగానాలు మాత్రమేనని చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి. ఈ పుకార్లు, సీక్వెల్ క్యాస్టింగ్‌పై వచ్చిన ప్రచారాలపై `హనుమాన్ అంశ` నిర్మాత అనుప్రియ నాగర్ స్పందించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వందల కోట్ల వసూళ్లు సాధించడంతో బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, నటులు తమను సంప్రదించి అభినందించడం నిజమేనని తెలిపారు.
కానీ తమ మొదటి ప్రాధాన్యం వ్యాపారాత్మక హంగామా కాదని తేల్చి చెప్పారు. సినిమా సక్సెస్‌పై స్పందిస్తూ తమ చిత్రం అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిందని, అందులోని సహజత్వం , నిజాయితీ మాత్రమే ప్రేక్షకుల హృదయాలను తాకాయని అనుప్రియ పేర్కొన్నారు. ఎంతటి పెద్ద ఆఫర్లు వచ్చినా కాస్టింగ్ జోడించే అవకాశం ఉన్నా? నీమ్ కరోలీ బాబా దివ్య సందేశాన్ని అంతే ప్రామాణికంగా, ఆడంబరాలు లేకుండా ప్రేక్షకులకు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇక సీక్వెల్ కథ విషయానికి వస్తే నీమ్ కరోలీ బాబా తొలి జీవిత ఘట్టాలను, ఆయన జన్మస్థలమైన ఫిరోజాబాద్‌తో పాటు ఆగ్రా, మధురలతో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని `హనుమాన్ అంశ 2` లో చూపించబోతున్నట్లు దర్శకుడు విశాల్ చతుర్వేది ఇదివరకే వెల్లడించారు. కథలోని ఆధ్యాత్మిక ఆత్మ దెబ్బతినకుండా, పాత్రల అవసరం మేరకు మాత్రమే నటీనటుల ఎంపిక ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
మొత్తానికి ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా వచ్చి భారతదేశ చిత్రసీమను ఆశ్చర్యపరిచిన ఆధ్యాత్మిక ఫ్రాంచైజీ, సీక్వెల్‌లోనూ అదే నిబద్ధతను కొనసాగించాలని నిశ్చయించుకుంది. బాలీవుడ్ బిగ్ స్టార్ల ప్రచారాన్ని పక్కనపెట్టి విశ్వాసం , కంటెంట్‌నే నమ్ముకుని రూపుదిద్దుకుంటున్న `హనుమాన్ అంశ 2` రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
