Begin typing your search above and press return to search.

భ‌ర్త నుంచి భ‌ర‌ణం కోరని హన్సిక మంచిత‌నం!

నటి హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియా నుంచి విడాకులు తీసుకోవడం ఆ ప్రక్రియలో ఆమె భరణం ఆశించలేదనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

By:  Sivaji Kontham   |   11 March 2026 11:21 PM IST
భ‌ర్త నుంచి భ‌ర‌ణం కోరని హన్సిక మంచిత‌నం!
X

నటి హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియా నుంచి విడాకులు తీసుకోవడం ఆ ప్రక్రియలో ఆమె భరణం ఆశించలేదనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2022 డిసెంబర్ 4న జైపూర్‌లోని ముండోటా కోటలో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృష్టించాయి. అయితే అతి తక్కువ కాలంలోనే వీరి మధ్య మనస్పర్థలు రావడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.. వీరిద్దరూ 2024 జూలై 2 నుండి విడివిడిగా నివసిస్తున్నారు. వీరి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి ఇద్దరినీ కలిపేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంతో ప్రయత్నించారు. పెళ్లిని కాపాడుకోవాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాల వారు సూచించినా కానీ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. చివరకు విడిపోవడమే తమకు శ్రేయస్కరమని హన్సిక - సోహైల్ ఒక ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు.

ఈ విడాకుల ప్రక్రియలో అత్యంత ఆలోచ‌నాత్మ‌క‌ విషయం ఏమిటంటే.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న ఈ జంట ఒకరిపై ఒకరు ఎలాంటి ఆర్థికపరమైన డిమాండ్లు చేసుకోలేదు. ముఖ్యంగా హన్సిక తన భర్త నుండి ఎటువంటి భరణం లేదా ఆస్తిని ఆశించకుండానే విడాకుల అఫిడవిట్ దాఖలు చేశారు.

సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు మాయం కావడం, ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం వంటి పరిణామాల తర్వాత ఈ చట్టపరమైన విడాకుల వార్త అధికారికంగా బయటకు వచ్చింది.

చ‌ట్ట‌ప‌ర‌మైన వ్య‌వ‌హారాలు:

హన్సిక - సోహైల్ దంప‌తులు సెక్షన్ 13B (హిందూ వివాహ చట్టం) కింద పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. దీనివల్ల కోర్టులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో కోర్టు 6 నెలల సమయం ఇస్తుంది. అయితే వారు ఇప్పటికే జూలై 2024 నుండి విడిగా ఉంటున్నట్లు పేర్కొన్నందున ఆ గడువును మినహాయించాలని వారు కోరే అవకాశం ఉంది. వారి అఫిడవిట్‌లో ముందు ముందు కూడా ఒకరి ఆస్తిపై ఒకరికి ఎలాంటి హక్కులు ఉండవు అని స్పష్టంగా పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో భరణం కోసం మళ్లీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.

ప‌బ్లిసిటీ స్టంట్ కాదు:

హన్సిక తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా నుండి తొలగించినప్పుడు చాలా మంది ఇది కేవలం `పబ్లిసిటీ స్టంట్` అని భావించారు. కానీ కోర్టు పత్రాలు బయటకు రావడంతో ఆమె నిజంగానే తన వైవాహిక బంధానికి స్వస్తి పలికారని స్పష్టమైంది. భరణం తీసుకోకుండా గౌరవప్రదంగా విడిపోవాలని హ‌న్షిక‌ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

హన్సిక తదుపరి సినిమాలు:

వ్యక్తిగత జీవితంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా.. హన్సిక తన వృత్తిపరమైన జీవితంపై పూర్తి ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం త‌న‌ చేతిలో 5-6 ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. గాంధారి అనే ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ లో హ‌న్షిక న‌టిస్తోంది. ఇందులో నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే `మ్యాన్` అనే సినిమాలో హన్సిక ప్రధాన పాత్రలో కనిపిస్తారు. తమిళంలో రూపొందుతున్న రౌడీ బేబి చిత్రం నిర్మాణానంత‌ర ప‌నులు ముగించి రిలీజ్ కి సిద్ధ‌మైంది. టాలీవుడ్‌లో ఒక వెబ్ సిరీస్‌తో పాటు, రెండు చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించేందుకు చర్చలు జరుపుతున్నారు.