Begin typing your search above and press return to search.

భరణం తీసుకోని హన్సిక.. విడాకుల తర్వాత తొలిసారి అలాంటి పోస్ట్

టాలీవుడ్ ‘దేశముదురు’ బ్యూటీ హన్సిక మోత్వానీ తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Madhu Reddy   |   13 March 2026 6:00 PM IST
భరణం తీసుకోని హన్సిక.. విడాకుల తర్వాత తొలిసారి అలాంటి పోస్ట్
X

టాలీవుడ్ ‘దేశముదురు’ బ్యూటీ హన్సిక మోత్వానీ తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె అధికారికంగా విడాకులు తీసుకున్న వార్త అభిమానులను కొంత కలవరపెట్టినా, ఆమె స్పందించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. విడాకుల తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించిన హన్సిక, తన మనోధైర్యాన్ని చాటుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కష్టాల్లో కూడా పాజిటివ్‌గా ఎలా ఉండాలో ఆమె తన పోస్ట్‌తో నిరూపించింది. ఆ వివరాలు ఇలా వున్నాయి..





ఆ ఒక్క మాటతో క్లారిటీ:

చట్టబద్ధంగా విడాకులు మంజూరైన మరుసటి రోజే హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "చార్దీ కలా ఆల్వేస్" (Chardi Kala always) అని రాసుకొచ్చింది. ఈ పంజాబీ పదానికి అర్థం ఏమిటంటే.. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎంతటి కష్టం వచ్చినా అచంచలమైన ధైర్యంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం. తన వైవాహిక బంధం ముగిసినా, తాను కృంగిపోలేదని, రెట్టింపు ఉత్సాహంతో తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు ఈ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. ఏళ్ల తరబడి సైలెంట్‌గా ఉన్న హన్సిక, ఇలా ఒక్క మాటతో తన మనసులోని ధైర్యాన్ని చెప్పడం విశేషం.

భరణం వద్దు.. మనశ్శాంతి ఉంటే చాలు:

హన్సిక విడాకుల విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఆమె తన భర్త నుండి ఎలాంటి భరణం కోరలేదు. ఆర్థిక ప్రయోజనాల కంటే తన ప్రశాంతతకే ఆమె ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. మార్చి 11న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఉన్న అభిప్రాయభేదాలు, జీవనశైలిలో మార్పుల వల్ల బంధం దెబ్బతిందని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. ఇక కేవలం ప్రశాంతమైన ముగింపు కోసమే హన్సిక ఎలాంటి డిమాండ్లు చేయకుండా విడాకులకు మొగ్గు చూపినట్లు ఆమె లాయర్ వెల్లడించారు.

గ్రాండ్ వెడ్డింగ్ నుండి విడాకుల దాకా:

2022 డిసెంబర్‌లో జైపూర్‌లోని కోటలో అట్టహాసంగా జరిగిన వీరి పెళ్లి అప్పట్లో ఒక సంచలనం. వీరి వివాహ వేడుకలను ఒక డాక్యుమెంటరీగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా విడుదల చేశారు. అయితే, పెళ్లైన కొన్నాళ్లకే అభిప్రాయభేదాలు తలెత్తడం, కలిసి ఉండలేమని అర్థం కావడంతో 2024 జులై నుండే వీరు వేర్వేరుగా ఉంటున్నారు. బంధువులు, స్నేహితులు నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతో చివరకు న్యాయపరంగా విడిపోయారు. ప్రస్తుతం హన్సిక తన కెరీర్‌పై దృష్టి పెడుతోంది. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె, భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని, వాటిని దాటుకుని ముందుకు వెళ్లడమే అసలైన విజయం అని హన్సిక నిరూపిస్తోంది. ఆమె తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయానికి నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.