ట్రెండీ స్టోరీ: విడాకులయ్యాక.. తల్లిని మించిన తోడు ఇంకెవరు?
జీవిత ప్రయాణంలో మధ్యలో తోడైన వారు మధ్యలోనే నిష్క్రమించినా.. కన్నతల్లి మాత్రం కడవరకు నీడలా నిలుస్తుందనేది అక్షర సత్యం.
By: Sivaji Kontham | 18 March 2026 9:00 PM ISTజీవిత ప్రయాణంలో మధ్యలో తోడైన వారు మధ్యలోనే నిష్క్రమించినా.. కన్నతల్లి మాత్రం కడవరకు నీడలా నిలుస్తుందనేది అక్షర సత్యం. వైవాహిక బంధం విచ్ఛిన్నమై ఒంటరిగా మిగిలిన తరుణంలో నటీమణులకు వారి కుటుంబమే కొండంత అండగా నిలుస్తోంది. క్రికెటర్ చాహల్ నుంచి విడిపోయిన ధనశ్రీ వర్మకు ఆమె తల్లి పెద్ద అండగా నిలవగా కథానాయిక హన్షిక మోత్వానీకి ఇప్పుడు తన తల్లి అండగా నీడగా నిలిచారు.
వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్షిక వివాహ బంధం అధికారికంగా ముగిసింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. పెళ్లయిన కొద్ది కాలానికే చిన్న చిన్న విషయాల్లో విభేదాలు రావడంతో వారు కలిసి ఉండలేమని నిర్ణయించుకుని జూలై 2024 నుండి విడిగా ఉంటున్నారు. హన్షిక ఈ విడాకుల ప్రక్రియలో ఎటువంటి భరణం ఆశించకుండా గౌరవప్రదంగా ఈ బంధం నుండి బయటకు రావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి.. భగవంతుడిపై నమ్మకంతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే హన్షిక ఈ కఠిన పరిస్థితులను అధిగమించడంలో ఆమె తల్లి మోనా మోత్వాని కీలక పాత్ర పోషించారు.
కెరీర్ ప్రారంభం నుండి హన్షికకు మేనేజర్‌గా, గైడ్‌గా ఉన్న తన తల్లి ఇప్పుడు విడాకుల తర్వాత కూడా ఆమెకు నీడలా తోడుంటున్నారు. సోహైల్‌తో వివాహం జరిగినప్పుడు ఎంతగా సంబరపడ్డారో ఇప్పుడు విడాకుల సమయంలో కూడా హన్షికకు మానసిక ప్రశాంతతనిచ్చేందుకు ఆమె వెన్నంటే నిలిచారు. హన్షిక తన ప్రొఫెషనల్ లైఫ్‌పై దృష్టి పెట్టేలా చేస్తూ తన కూతురికి తల్లిని మించిన తోడు ఎవరూ లేరని మోనా మోత్వాని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం హన్షిక తన తల్లి మద్దతుతో తిరిగి సినిమాల్లో బిజీ అవుతూ తన జీవన ప్రయాణాన్ని ధైర్యంగా ముందుకు సాగిస్తోంది.
హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయిన నటాషా స్టాంకోవిక్ తన స్వదేశమైన సెర్బియాకు వెళ్లకుండా ముంబైలోనే ఉంటూ తన కుమారుడు అగస్త్యతో కలిసి ఉంటోంది. హార్థిక్ తో కలతల నేపథ్యంలో నటాషా స్వదేశానికి కుమారుడు అగస్త్యతో కలిసి వెళ్లి తన తల్లిదండ్రుల వద్దనే కొంత కాలం ఉన్నారు. కానీ కెరీర్ కోసం నటాషా తిరిగి ముంబైకి వచ్చారు. నటాషాకు తల్లిదండ్రులు దూరంగా ఉన్నా.. తన కుమారుడి భవిష్యత్తు కోసం ముంబైలోనే ఉంటూ తన ఆత్మీయుల మద్దతుతో వృత్తిపరమైన జీవితాన్ని కొనసాగిస్తోంది.
వెటరన్ నటి హేమ మాలిని కుమార్తె ఇషా డియోల్ తన భర్త భరత్ తఖ్తానీ నుంచి విడిపోయాక తన తల్లి వద్దనే ఉన్నారు. ఇటీవలే తన తండ్రి ధర్మేంద్ర మృతి చెందిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో ధనుష్ నుంచి విడిపోయిన తర్వాత హై ప్రొఫైల్ లైఫ్ ని యథాతథంగా కొనసాగించడంలో ఐశ్వర్య తన తల్లిదండ్రుల పూర్తి మద్ధతును పొందారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సతీమణి సైంధవి విడాకుల అనంతరం కుటుంబీకుల తోడు నీడలో జీవన గమనాన్ని సాగిస్తున్నారు.
అయితే ఈ మహిళలంతా స్వయం సంపాదకులు. ఇతరులపై ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారు. కొందరు భర్త నుంచి భరణం తీసుకున్నా.. హన్షిక లాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న సెలబ్రిటీలు భరణం కోరకుండా స్వయంశక్తితో జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అయితే విడాకులు అనేది ఎమోషనల్ బ్లాకేజీ. ఇలాంటి క్లిష్ట సమయాల్లో తారలకు వారి తల్లిదండ్రులు ఇచ్చే మానసిక ధైర్యం ముఖ్యమైనది.
