పాపులర్ హెయిర్ స్టైలిస్ట్‌పై 32 కేసులు?
ఈ కేసులో మోసపోయిన మొత్తం పెట్టుబడి రూ.5 కోట్లను దాటవచ్చని, చాలా మంది పెట్టుబడిదారులు ఇంకా వారి అసలు మొత్తాన్ని కూడా తిరిగి పొందలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
By: Sivaji Kontham | 3 Nov 2025 1:29 PM ISTపాపులర్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారని తెలిసింది. ఆయన వ్యవస్థాపకుడిగా నిర్వహిస్తున్న ఓ ప్రయివేట్ కంపెనీ పెట్టుబడిదారులు ఎదురు తిరగడంతో పోలీస్ దర్యాప్తు ప్రారంభమైంది. తాజా సమాచారం మేరకు, పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా కంపెనీ వర్గాలు పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి ఇవ్వడం ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు మొత్తం బకాయిల్లో కొంత భాగం మాత్రమే తిరిగి చెల్లించారు. హెయిర్ స్టైలిష్ట్ అతని సహచరులు ఆరోగ్యం, సౌందర్య ఉత్పత్తుల సంస్థ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి, తరువాత చెల్లింపులు చేయలేదని ఆరోపణలు వెల్లువెత్తగా దీనిపై కేసు నమోదైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. దాదాపు 200 మందికి పైగా వ్యక్తులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టారు. మొత్తం వసూలు చేసిన నిధి విలువ రూ.5 కోట్లుగా ఉందని అంచనా. కంపెనీ సహచరులు ఫోలికల్ గ్లోబల్ బ్యానర్ కింద ఆరోగ్యం సౌందర్య ఉత్పత్తుల రంగంలో లాభదాయకమైన రాబడిని హామీ ఇచ్చి ఢిల్లీ, సంభాల్ సహా ఆ పొరుగు ప్రాంతాలలో పెట్టుబడిదారులను ఆకర్షించారని దర్యాప్తులో తేలింది. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సెమినార్లు , ప్రమోషనల్ ఈవెంట్‌లు నిర్వహించారు. కంపెనీని ప్రముఖ వెల్‌నెస్ బ్రాండ్‌గా ప్రచారం చేసారు. అనేక సందర్భాల్లో, పెట్టుబడిదారులకు నోటరీ చేయించిన అఫిడవిట్లు, ఒప్పంద పత్రాలు అందించారు. భారీ రాబడిని హామీ ఇచ్చారు. అయితే రిటర్నులు మాత్రం సరిగా లేవు. ప్రకటించిన రాబడిలో సగం కంటే తక్కువ చెల్లిస్తుండటంతో సభ్యులంతా ఎదురు తిరిగారు.
సెప్టెంబర్ 24 -అక్టోబర్ మధ్య, హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు ఈ కంపెనీ అధిపతులపై 32 ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసులో మోసపోయిన మొత్తం పెట్టుబడి రూ.5 కోట్లను దాటవచ్చని, చాలా మంది పెట్టుబడిదారులు ఇంకా వారి అసలు మొత్తాన్ని కూడా తిరిగి పొందలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
అయితే సదరు స్టైలిష్ట్ సమస్యను పరిష్కరించుకునేందుకు ముందుకు వచ్చారు. తన న్యాయవాది ద్వారా కోర్టు మధ్యవర్తిత్వ ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన పెట్టుబడిదారులకు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించారు. అయితే తిరిగి చెల్లించేది గిట్టుబాటు కానిది అని సంస్థలోని సభ్యులు వాదిస్తున్నారు.
జవాబుదారీతనం నిర్ధారించడానికి, అధికారులు అతడిపై లుకౌట్ సర్క్యులర్‌ను కూడా జారీ చేశారు, దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు విదేశీ ప్రయాణాలకు అనుమతులు నిషేధించారు. సదరు సెలబ్రిటీ స్టైలిష్ట్ చాలా మంది తెలుగు, హిందీ, తమిళ స్టార్లకు హెయిర్ డిజైనర్ గా పని చేసారు. టాలీవుడ్ లో ప్రముఖ హీరోలకు అతడు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పర్యవేక్షణ సరిగా లేనప్పుడు వెల్ నెస్ రంగంలో ఇలాంటి పెట్టుబడులు ఆకర్షించడం, మోసం చేయడం సహజంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.
