Begin typing your search above and press return to search.

ట్రంప్ రూల్స్.. H-1Bపై దెబ్బ!

ఒకవైపు లక్షల రూపాయల ఖర్చు, మరోవైపు నర్సుల కొరతతో హెల్త్‌కేర్ సంక్షోభం.. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ఈ వీసా కష్టాల నుండి గట్టెక్కించే కొత్త బిల్లు కథేంటో చూసేద్దాం..

By:  Madhu Reddy   |   6 Jun 2026 9:00 PM IST
ట్రంప్ రూల్స్.. H-1Bపై దెబ్బ!
X

అమెరికా కలలు కనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు, అక్కడ నివసిస్తున్న భారతీయులకు ఇది నిజంగా గడ్డుకాలమే. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన కఠినమైన వీసా నిబంధనలు, ముఖ్యంగా భారీగా పెంచిన ఫీజులు హెచ్-1బీ దరఖాస్తులపై పిడుగులా పడ్డాయి. ఒకవైపు లక్షల రూపాయల ఖర్చు, మరోవైపు నర్సుల కొరతతో హెల్త్‌కేర్ సంక్షోభం.. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ఈ వీసా కష్టాల నుండి గట్టెక్కించే కొత్త బిల్లు కథేంటో చూసేద్దాం..

ట్రంప్‌కు చెక్ వేయాలనే ఉద్దేశంతో బానీ వాట్సన్ అమెరికా ప్రతినిధుల సభలో ఒక ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు.దీని పేరు 'వెల్కమింగ్ ఇంటర్నేషనల్ సక్సెస్ యాక్ట్'. ఆశ్చర్యకరంగా, ఈ బిల్లు కేవలం ఒకే ఒక్క పారాగ్రాఫ్‌తోనే రూపొందించబడింది. ఇక 2025లో ట్రంప్ ఇచ్చిన కఠిన వీసా ఉత్తర్వులకు పవర్ లేకుండా చేయడం, వాటి కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు కాకుండా ఆపడమే దీని ప్రధాన లక్ష్యం.

రూ. 83 లక్షల ఫీజు.. భయపడుతున్న కంపెనీలు:

ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా 100,000 డాలర్స్ అంటే సుమారు రూ. 83 లక్షలకు పెంచేసింది. ఇంత భారీ మొత్తం చెల్లించి విదేశీయులను తెచ్చుకోవడం అమెరికా కంపెనీలకు భారంగా మారింది. ఇక దీని ప్రభావం ఎలా ఉందంటే, అమెరికా బయటి నుండి వచ్చే నాన్-క్యాప్ వీసా పిటిషన్లు ఏకంగా 87 శాతం పడిపోయాయి. అంటే టాలెంట్ ఉన్నా, డబ్బులు కట్టలేక కంపెనీలు వెనక్కి తగ్గుతున్నాయి.

ఆసుపత్రుల్లో నర్సుల కొరత ముప్పు:

ఈ ఆంక్షల ప్రభావం కేవలం ఐటీ రంగంపైనే కాదు, ప్రాణాలు కాపాడే హెల్త్‌కేర్ రంగంపై కూడా పడింది. నర్సింగ్ చదువుల కోసం ఇచ్చే ఫెడరల్ లోన్స్‌పై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇక దీనికి తోడు వీసా కష్టాలు తోడవడంతో, అమెరికాలో రాబోయే రోజుల్లో నర్సుల కొరత తీవ్రం కానుంది. ఇది రోగుల ప్రాణాల మీదకు వస్తుందని బానీ వాట్సన్ హెచ్చరిస్తున్నారు.

ఏకమవుతున్న డెమొక్రాట్లు:

బానీ వాట్సన్‌తో పాటు వైవెట్ డి. క్లార్క్, లోయిస్ ఫ్రాంకెల్ వంటి మరికొందరు కీలక డెమొక్రాట్ నేతలు ఈ బిల్లుకు మద్దతుగా నిలిచారు. ఇక ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని వారు బలంగా వాదిస్తున్నారు. ఇక వీరంతా కలిసి చట్టసభలో ఈ కొత్త బిల్లును గట్టెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు.

వీసా ఫీజుపై కోర్టుల్లో పోరాటం:

ప్రభుత్వ నిర్ణయాన్ని కేవలం రాజకీయ నాయకులే కాదు, వ్యాపార వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. 'యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్' తో తో పాటు పలు రాష్ట్రాలు ఈ ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ కోర్టుల్లో కేసులు దాఖలు చేశాయి. ఇక ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానాల్లో ఉంది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపైనే వేలమంది విదేశీ నిపుణుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

అమెరికా అభివృద్ధిలో విదేశీ టాలెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ, ప్రస్తుత కఠిన నిబంధనలు ఆ ద్వారాలను మూసేస్తున్నాయి. ఏది ఏమైనా, ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి మాత్రం హెచ్-1బీ ఆశావహులను ఆందోళనలో పడేస్తోంది.