జననాయగన్ రీమేక్ రూమర్స్ పై డైరెక్టర్ క్లారిటీ!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈయన సౌత్, నార్త్ తేడా లేకుండా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
By: Madhu Reddy | 28 Dec 2025 11:45 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈయన సౌత్, నార్త్ తేడా లేకుండా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. అలాంటి ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించి, ఈసారి ఎన్నికలలో బరిలోకి దిగి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం విజయ్ దళపతి హెచ్.వినోద్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం జన నాయగన్. ఈ చిత్రాన్ని జననాయకుడు అంటూ తెలుగులో డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను మలేషియాలో నిన్న రాత్రి చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ లో భాగంగా జన నాయగన్ సినిమా రీమేక్ అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ వేదికగా స్పందించి రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు హెచ్. వినోద్.
విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా నుండి విడుదలైన ప్రోమో, పోస్టర్లు అందులో హీరో స్టైలింగ్ లుక్ చూసి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా రీమేక్ అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే దీనిపై హెచ్.వినోద్ మాట్లాడుతూ.." మీరు అనుకుంటున్నట్టు ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు. పూర్తిగా 100% విజయ దళపతి కోసం రూపొందించిన చిత్రం. దయచేసి రీమేక్ అంటూ వస్తున్న పుకార్లను నమ్మకండి" అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.
మొత్తానికైతే ఇన్ని రోజులు భగవంత్ కేసరికి రీమేక్ అంటూ వస్తున్న వార్తలకు ఒక్క మాటతో చెక్ పెట్టారు డైరెక్టర్. మరి విజయ దళపతి కోసమే పూర్తిగా 100% కథను రూపొందించానని చెప్పిన డైరెక్టర్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజా సాబ్ మూవీకి పోటీగా తమిళ్ ఒరిజినల్ తో పాటు.. తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్ లలో కూడా విడుదల కాబోతోంది.
అటు ఈ సినిమా విజయ్ దళపతి రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు తీసే ఆయన ఆఖరి చిత్రం అని చెప్పవచ్చు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమాలు చేస్తారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. జననాయగన్ సినిమా విషయానికొస్తే.. బాబీ డియోల్ విలన్ గా నటిస్తూ ఉండగా.. మమిత బైజు , పూజ హెగ్డే , సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
