Begin typing your search above and press return to search.

'భ‌గ‌వంత్ కేస‌రి'తో 50శాతం పోలిక‌లు ఉన్న సినిమా!

దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం `జన నాయగన్` విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి

By:  Sivaji Kontham   |   21 July 2026 3:50 PM IST
భ‌గ‌వంత్ కేస‌రితో 50శాతం పోలిక‌లు ఉన్న సినిమా!
X

దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం `జన నాయగన్` విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొంతకాలంగా ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం `భగవంత్ కేసరి` రీమేక్ అంటూ వస్తున్న ప్రచారానికి దర్శకుడు హెచ్. వినోద్ ఎట్టకేలకు తెరదించారు. `జన నాయగన్` కథలో `భగవంత్ కేసరి` ఛాయలు ఎంతవరకు ఉన్నాయో వివరిస్తూ.. రీమేక్ స్క్రిప్ట్‌లో చేసిన కీలక మార్పుల గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు వినోద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. `జన నాయగన్` చిత్రం 50 శాతం మాత్రమే `భగవంత్ కేసరి`ని పోలి ఉంటుంది. ముఖ్యంగా ప్రథమార్ధంలో దాదాపు 60 శాతం వరకు ఒరిజినల్ కథలోని సీన్లు ఉన్నా.. ద్వితీయార్ధం లో మాత్రం కేవలం 20 శాతం మాత్రమే రీమేక్ అంశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. విజయ్ ఆన్-స్క్రీన్ ఇమేజ్ .. ఆయన ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌కు సరిపోయేలా కథలో భారీగా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు.

నందమూరి బాలకృష్ణ - దళపతి విజయ్ ల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన శైలి పూర్తిగా భిన్నమైనవని వినోద్ వివరించారు. బాలయ్య గారి పవర్, ఆయన మాస్ ఇమేజ్ వేరు.. `జై బాలయ్య` అనే నామస్మరణతో ఆయనొక ప్రత్యేకమైన `బాలయ్య యూనివర్స్`లో కనిపిస్తారు. అక్కడ ఆయన ఎలాంటి సాహసమైనా చేయగలరు. విజయ్ సర్ కూడా ఏమైనా చేయగలరని భావించినా.. ఆయన స్క్రీన్ ఇమేజ్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకే బాలయ్య గారి శైలికి సరిపోయే సన్నివేశాలను విజయ్ గారి యూనివర్స్‌కు తగ్గట్టుగా మార్చాము! అని దర్శకుడు పేర్కొన్నారు.

గతంలో అజిత్ కుమార్ హీరోగా హిందీ `పింక్` చిత్రాన్ని `నేర్కొండ పార్వై`గా రీమేక్ చేసిన అనుభవం ఉన్న హెచ్. వినోద్... ఈ రెండింటి మధ్య పోలికలను ప్రస్తావించారు. అస‌లు భ‌గ‌వంత్ కేస‌రి సినిమాని రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది? అంటే.. అజిత్ త‌ర‌హాలోనే విజ‌య్ కూడా మ‌హిళా సాధికార‌త‌, మ‌హిళా ఉన్న‌తి ఉన్న సినిమాల్లో న‌టించేందుకు విజ‌య్ ఆస‌క్తిగా ఉంటార‌ని అందుకే భ‌గ‌వంత్ కేస‌రిని రీమేక్ కోసం ఎన్నుకున్నామ‌ని కూడా వినోద్ తెలిపారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజూ, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుని.. దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ చిత్రం విడుదల కావడం విశేషం. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సి) సమస్యలు.. ఇతర అడ్డంకుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన `జన నాయగన్` చిత్రం ఎట్టకేలకు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. పొలిటికల్ ఎంట్రీ, విభిన్నమైన కథాంశం కలగలిసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.