హిట్ కాంబో బ్రేక్ చేయాల్సిన అవసరం ఏంటి అనిల్...?
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 19 Jun 2026 1:00 PM ISTవెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో వరుస హిట్స్‌ను దక్కించుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా అనిల్ రావిపూడి దర్శకుడిగా మొదటి సినిమా నందమూరి కళ్యాణ్ రామ్‌తో చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇద్దరు హీరోలతోనూ హిట్ కాంబో అనిపించుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. 2027 సంక్రాంతికి ఇతర సినిమాలన్నీ సైడ్ కావాల్సిందే అని, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ, కామెడీ డ్రామా మాత్రమే బరిలో ఉంటుందంటూ అప్పుడే కొందరు సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో...
అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ సినిమాలు ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలు రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంలో కచ్చితంగా పాటల పాత్ర ప్రధానంగా ఉంది. ఆ రెండు సినిమాలకు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో, సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. దాంతో రెండు సినిమాలు భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. అందుకే వెంకటేష్‌తో అనిల్ రావిపూడి సినిమా అనగానే అంతా కూడా భీమ్స్ సంగీతం అనుకున్నారు. కానీ షాకింగ్‌గా అనిల్ చాలా బిజీగా ఉన్న జీవీ ప్రకాష్ కుమార్ ను ఎంపిక చేసుకున్నాడు. జీవీ ప్రకాష్ ఒకవైపు నటుడిగా వరుస సినిమాలు చేస్తూ సంగీత దర్శకుడిగానూ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీకి జీవీ ప్రకాష్ సంగీతం...
జీవీ ప్రకాష్ కుమార్‌తో సినిమాలు చేయించుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి, ఆయనతో ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది, అంతే కాకుండా ఆయన టైం ఇచ్చినప్పుడు మాత్రమే చేస్తాడు అని అంటారు. తమిళనాట జీవీ ఎన్ని కండీషన్స్ పెట్టినా దర్శకులు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ టాలీవుడ్‌లో కాస్త తక్కువగానే ఆయన సినిమాలు చేస్తున్నాడని చెప్పక తప్పదు. థమన్‌తో పోల్చితే జీవీ కాస్త తక్కువ సినిమాలను టాలీవుడ్‌లో చేస్తున్నాడు. ఆ లోటును భర్తీ చేసే విధంగా జీవీ తన వర్క్ ప్లాన్ మార్చుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. అంటే గతంలో మాదిరిగా కాకుండా స్పీడ్‌గా తెలుగు సినిమాలు చేయాలని భావిస్తున్నాడట అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. కారణం ఏంటో కానీ అనిల్ రావిపూడి తన తాజా చిత్రానికి జీవీ ప్రకాష్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. జీవీని ఎలా సెలక్ట్ చేశాడంటూ సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది.
భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో...
సంగీత దర్శకుడు జీవీ వర్క్ స్టైల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కచ్చితంగా జీవీ ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందిస్తాడు. అయితే అనిల్ తన గత రెండు చిత్రాల ఫలితాలను పట్టించుకోకుండా సంగీత దర్శకుడిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. భీమ్స్‌తో మరో సినిమా కొనసాగించాల్సి ఉందని కొందరు అంటూ ఉంటే, అనిల్‌కి భీమ్స్‌కి మంచిగా సెట్ అయ్యింది. ఇలాంటి సమయంలో ఆ కాంబోను బ్రేక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో భీమ్స్ వరుస సూపర్ హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయినా కూడా భీమ్స్ ను అనిల్ పక్కన పెట్టడం వెనుక ఏదైనా ఉద్దేశం ఉండి ఉంటుందా అనే చర్చ నడుస్తోంది.
భీమ్స్‌తో అనిల్‌కి అంతా బాగానే ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే, అనిల్ మార్పు కోరుకుని ఉంటాడేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి హిట్ కాంబో బ్రేక్ చేయడం ద్వారా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే మొదటి సింగిల్‌ను అనిల్ విడుదల చేయడం ఖాయం. అప్పుడు ఆయన నిర్ణయం పై ఒక నిర్ణయానికి రావచ్చు. 2027 సంక్రాంతికి ఈ సినిమా విడుదలై హిట్ అయితే మరో మూవీ వీరి కాంబోలో ఉంటుందా అనేది కూడా చూడాలి.
