సినిమా (Vs) రాజకీయం: లారెన్స్ తర్వాత జీవీ ప్రకాష్ పెద్ద ప్రకటన!
ఇప్పుడు యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
By: Sivaji Kontham | 16 Jun 2026 11:08 AM ISTతమిళనాడులో సినీసెలబ్రిటీలు రాజకీయాలు చేయడం చాలా రొటీన్ మ్యాటర్. ఇటీవల దళపతి విజయ్ మొదటి ప్రయత్నమే ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించడంతో సినిమావాళ్లను తంబీలు ఏ రేంజులో నమ్ముతారో, ఎంతగా ఆరాధిస్తారో అర్థమైంది. దళపతి విజయ్ విజయం చూసిన తర్వాత, కొరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టార్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ కుటుంబం నుంచి వారసుడిగా జీవీ ప్రకాష్ ఈ ప్రకటన చేయడం ఉత్కంఠను కలిగిస్తోంది.
దక్షిణాది చిత్రసీమలో సంగీత దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన జీవీ ప్రకాష్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఈ యువ సంగీతదర్శకుడు తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. సినీ ప్రయాణం తర్వాత అంతా అనుకూలిస్తే ప్రజా సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. గతంలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సామాజిక సేవతో పాటు రాజకీయాల వైపు అడుగులు వేయగా, ఇప్పుడు అదే బాటలో జీవీ ప్రకాష్ కూడా అంతకంటే పెద్ద ప్రకటన చేయడం గమనార్హం.
ఈ ఇంటర్వ్యూలో జీవీ ప్రకాష్ తన సినీ కెరీర్ లిమిటేషన్స్ పై ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తాను ఇండస్ట్రీలో మరో 15 సంవత్సరాల పాటు కొనసాగుతానో లేదో తనకు తెలియదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో, చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఒక స్టార్ సెలబ్రిటీ.. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే సినిమా రంగానికి దూరమవ్వడం గురించి మాట్లాడటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సినిమాలకు స్వస్తి పలికిన తర్వాత తన పూర్తి సమయాన్ని ప్రజా సేవకే కేటాయించాలనుకుంటున్నట్లు జీవీ ప్రకాష్ స్పష్టమైన ప్రకటన చేసారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రజా సమస్యలపై పోరాడటానికి ప్రత్యక్షంగా రంగంలోకి దిగడమే తన అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా.. నిజ జీవితంలోనూ ప్రజా నాయకుడిగా మారాలనే బలమైన సంకల్పం ఈ యువకుడి మాటల్లో వ్యక్తమైంది.
ప్రజా సేవ చేయాలనే తన ఆశయానికి రాజకీయాలు కూడా ఒక వేదిక కావచ్చని జీవీ అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిగత భావజాలానికి.. సిద్ధాంతాలకు సరిపోయే రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే భవిష్యత్తులో ఆ పార్టీతో కలిసి నడవడానికి .. వారితో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని దానికి కచ్చితంగా అవకాశాలు ఉన్నాయని అతడు వెల్లడించారు.
జీవీ ప్రకాష్ సిద్ధాంతాలకు సరిపోయే పార్టీతో కలిసి పనిచేస్తానని చెప్పడంతో తమిళనాడు రాజకీయాల్లో ఆయన ఏ వైపు అడుగులు వేయబోతున్నారనే చర్చ జోరందుకుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన `తమిళగ వెట్రి కళగం` (టీవీకే) పార్టీ వైపు అతడు మొగ్గు చూపుతారా లేక బీజేపీ నేత అన్నామలై సిద్ధాంతాలతో చేతులు కలుపుతారా అనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. లారెన్స్ తర్వాత జీవీ ప్రకాష్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతానికి చర్చల్లో నిలుస్తోంది.
