Begin typing your search above and press return to search.

సత్య 'జెట్లీ'.. దుబాయ్‌ లో ఫన్నీ రీజన్ తో బ్యాన్?

స్టార్ కమెడియన్ సత్య లీడ్ రోల్ లో తెరకెక్కిన కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ జెట్లీ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   3 May 2026 10:35 PM IST
సత్య జెట్లీ.. దుబాయ్‌ లో ఫన్నీ రీజన్ తో బ్యాన్?
X

స్టార్ కమెడియన్ సత్య లీడ్ రోల్ లో తెరకెక్కిన కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ జెట్లీ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సత్యతో పాటు వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించిన ఆ సినిమాలో గుండు సుదర్శన్, అజయ్, గెటప్ శ్రీను, వైవా హర్ష, కబీర్ బేడీ, శ్రీనివాసరెడ్డి, రియా సింఘా తదితరులు కనిపించారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మైత్రీ మూవీ సీఈవో చిరంజీవి, హేమలత నిర్మించారు.

మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పించిన ఆ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా, కామెడీతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆ చిత్రానికి యూఏఈ దేశాల్లో అనుమతి లభించలేదు. దుబాయ్‌ తో పాటు గల్ఫ్‌ లోని కొన్ని దేశాల్లో జెట్లీ రిలీజ్ కాలేదు. దీనికి గల కారణంపై ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌ లో నిర్మాత చిరంజీవి (చెర్రీ) స్పందించారు.

ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ప్రెస్ మీట్‌ లో చెర్రీ మాట్లాడుతూ.. "సినిమాలో గుండు సుదర్శన్ చేసిన నూర్జహాన్ క్యారెక్టర్‌ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అదే క్యారెక్టర్ కారణంగా యూఏఈలో మాకు సమస్య ఎదురైంది. అక్కడి సెన్సార్ అధికారులు కొన్ని సన్నివేశాలను అరబ్ ప్రజలను హేళన చేసినట్లు భావించారు. ముఖ్యంగా ఆ పాత్ర తరచూ బాత్రూమ్‌ కు వెళ్లే సన్నివేశాలు వారికి అభ్యంతరకరంగా అనిపించాయి" అని వివరించారు.

ఆ వ్యాఖ్యలతో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధుల్లో ఒకరు సరదాగా స్పందిస్తూ.. "సమస్య ఉంటే యూఏఈ వాళ్లు బాత్రూమ్‌ కు వెళ్లరా?" అంటూ చమత్కరించారు. దీంతో అక్కడ ఉన్న మూవీ టీమ్ తోపాటు అంతా నవ్వేశారు. అదే విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఫన్నీ రీజన్‌ తో ఏకంగా సినిమా రిలీజ్ ను బ్యాన్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే సినిమాలో గుండు సుదర్శన్ నూర్జహాన్ పాత్ర అరబ్ సంస్కృతిని తప్పుగా చూపిస్తున్నట్లు యూఏఈ సెన్సార్ బోర్డు భావించినట్లు తెలుస్తోంది. అందుకే దుబాయ్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక సినిమా విషయానికి వస్తే, గుండు సుదర్శన్ నటనకు మంచి స్పందన వస్తోంది. తన కామెడీ టైమింగ్‌ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చిన్న పాత్ర అయినప్పటికీ, తనదైన శైలిలో నవ్వులు పంచుతూ సినిమాకు హైలైట్‌ గా నిలిచారని చెప్పుకుంటున్నారు. కాగా.. గుండు సుదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు అనేక సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తన నేచురల్ కామెడీతో క్రేజ్ సంపాదించుకున్నారు. జెట్లీలో కూడా అదే స్టైల్‌ తో మెప్పించారు.