గుణశేఖర్.. 'యుఫోరియా'తో బ్రేక్ వస్తుందా?
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కొత్తగా తెరకెక్కిస్తున్న సినిమా యుఫోరియా. ఆ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.
By: M Prashanth | 25 Jan 2026 12:00 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో భారీ విజయాలు సాధించిన ఆయన, అగ్ర హీరోలతో సినిమాలు తెరకెక్కించి ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. కానీ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలు ఆయనను వెంటాడుతున్నాయి.
గుణశేఖర్ రూపొందించిన వరుడు, నిప్పు, రుద్రమదేవి, శాకుంతలం వంటి భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా రుద్రమదేవిపై పెద్ద అంచనాలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఆ తర్వాత వచ్చిన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో గుణశేఖర్ కెరీర్ పై చర్చలు మొదలయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కొత్తగా తెరకెక్కిస్తున్న సినిమా యుఫోరియా. ఆ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సినిమాలో స్టార్ హీరోలు ఎవరూ లేరు. ఎక్కువగా కొత్త నటీనటులతోనే మూవీని రూపొందించారు. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా.. కథ, కథనంపై పూర్తి నమ్మకంతో ఈ సినిమాను చేస్తున్నట్లు గుణశేఖర్ చెబుతున్నారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు తనకు హిట్ చాలా అవసరమని, హిట్స్ లేకపోతే అవకాశాలు రావని చెప్పుకొచ్చారు. అందుకే కంటెంట్ పై నమ్మకంతో ఇప్పుడు యుఫోరియా చేశానని తెలిపారు. ఆ సినిమా తనకు కొత్త ఆరంభం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సినిమాపై దాదాపు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
అయితే పెద్ద స్టార్లు లేకపోయినా, టెక్నికల్ గా సినిమాను బాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. భూమిక, సారా అర్జున్, విఘ్నేశ్ గవిరెడ్డి, గౌతమ్ మేనన్ ప్రధాన పాత్రలు పోషించిన మూవీ.. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే కథాంశంతో రూపొందినట్లు టాక్ వినిపిస్తోంది. యుఫోరియా హిట్ అయితే గుణశేఖర్ మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన ప్రకటించిన మరో భారీ ప్రాజెక్ట్ హిరణ్య కశ్యప కూడా తిరిగి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ చేసినా.. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. యుఫోరియా విజయం సాధిస్తే.. ఆ సినిమా తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా ఒకప్పుడు హిట్లతో దూసుకెళ్లిన దర్శకుడు.. ఇప్పుడు కెరీర్ ను మళ్లీ నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే యుఫోరియా. మరి ప్రేక్షకులు ఆ సినిమాను ఎలా ఆదరిస్తారో చూడాలి. గుణశేఖర్ కు బ్రేక్ ఇస్తుందా? మళ్లీ ఆయన కెరీర్ కు కొత్త ఊపిరి పోస్తుందా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
