Begin typing your search above and press return to search.

వీడియో : గుణశేఖర్‌ 'యుఫోరియా' ట్రైలర్‌ టాక్‌

ఈసారి ఎక్కువ గ్యాప్‌ తీసుకోకుండా నిజ జీవిత సంఘటనల ఆధారంగా, తన మార్క్ సినిమాలకు పూర్తి దూరంగా గుణశేఖర్‌ రూపొందించిన చిత్రం 'యుఫోరియా'.

By:  Ramesh Palla   |   17 Jan 2026 1:58 PM IST
వీడియో : గుణశేఖర్‌ యుఫోరియా ట్రైలర్‌ టాక్‌
X

టాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన 'ఒక్కడు' సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తి అయిన విషయం తెల్సిందే. అప్పట్లో సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఒక్కడు సినిమాతో దర్శకుడు గుణశేఖర్ సైతం స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ అయ్యాడు. ఒక్కడు సాధించిన విజయం అప్పట్లో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు అంతా క్యూ కట్టారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మొత్తం తారుమారు అయ్యాయి. ఒక్కడు తర్వాత వచ్చిన అర్జున్‌, సైనికుడు, వరుడు, నిప్పు సినిమాలు డిజాస్టర్స్‌గా మిగిలిన విషయం తెల్సిందే. ఒక దర్శకుడు వరుసగా మూడు నాలుగు ఫ్లాప్స్ ను చవిచూస్తే తిరిగి పుంజుకోవడం అంత సాధ్యం కాదు. కానీ దర్శకుడు గుణశేఖర్‌ ఒక్కడు వంటి కమర్షియల్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు కనుక ఆయన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటూనే వచ్చింది. అందుకే ఆయన తీసిన రుద్రమదేవి, శాకుంతలం సినిమాలు మంచి స్పందన దక్కించుకున్నాయి.

రుద్రమదేవి సినిమా తర్వాత...

రుద్రమదేవి సినిమా తర్వాత ఏకంగా ఎనిమిది ఏళ్ల పాటు గ్యాప్‌ తీసుకున్న గుణశేఖర్ 2023లో శాకుంతలం సినిమాతో వచ్చాడు. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన గుణశేఖర్‌ కమర్షియల్‌గా పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ ఆయన స్థాయికి తగ్గ సినిమా కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసారి ఎక్కువ గ్యాప్‌ తీసుకోకుండా నిజ జీవిత సంఘటనల ఆధారంగా, తన మార్క్ సినిమాలకు పూర్తి దూరంగా గుణశేఖర్‌ రూపొందించిన చిత్రం 'యుఫోరియా'. ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై ముఖ్యంగా చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గంజాయి మత్తులో కొందరు డబ్బున్న వారి పిల్లలు చేస్తున్న అఘాయిత్యాలు ఏ స్థాయిలో సమాజంలో పెరిగి పోతున్నాయి అనేది ఈ సినిమా నేపథ్యంగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రావడంతో అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది.

భూమిక, సారా అర్జున్‌ల 'యుఫోరియా'

యుఫోరియా సినిమాలో సారా అర్జున్‌, భూమిక, గౌతమ్‌ మీనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ట్రైలర్ ను చూసిన తర్వాత భూమిక ఈ సినిమా ఒక నేరస్థుడి తల్లి పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. అలాంటి కొడుకును కన్నందుకు తనపై తానే కేసు పెట్టుకోవడంతో పాటు, తన కొడుకు వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిందని తెలిసి ఏకంగా అతడికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసే తల్లి కథతో ఈ సినిమా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ కనుక అందరిలోనూ ఈజీగా చర్చ జరిగే విధంగా సినిమా చేయగలదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాలోని విజువల్స్ కొన్ని హృదయాన్ని కదిలించే విధంగా ఉన్నాయి. చిన్న అమ్మాయిగా పలు సినిమాల్లో సారా అర్జున్‌ ను మనం చూశాం.. ఇప్పుడు ఈ సినిమాలో టీనేజ్ అమ్మాయిగా, అఘాయిత్యం కి గురి అయిన అమ్మాయిగా చూడబోతున్నాం.

గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో

లుక్స్ పరంగా సారా అర్జున్‌ ఆకట్టుకుంది. ఇక భూమిక నటనతో సినిమా స్థాయిని పెంచే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు కమ్‌ నటుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర ఏంటి, ఆయన పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది క్లీయర్‌గా ట్రైలర్‌లో చూపించలేదు. కానీ గుణశేఖర్‌ ఒక పవర్‌ ఫుల్‌ పాత్రను గౌతమ్‌ మీనన్‌కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గుణశేఖర్‌ కచ్చితంగా మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. కానీ ఆయన ఎంపిక చేసుకుంటున్న నేపథ్యం, తీసుకుంటున్న కథల విషయంలోనే కంప్లైంట్ ఉంది. మరి ఈ సినిమాతో అయిన గుణశేఖర్‌ హిట్‌ కొట్టేనా అనేది తెలియాలి అంటే ఫిబ్రవరి 6, 2026 వరకు వెయిట్‌ చేయాల్సిందే. సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గిన తర్వాత రాబోతున్న ఈ సినిమా కి మంచి స్పందన వస్తే, గుణశేఖర్‌ మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.