నేను అలా చేసి ఉంటే జైలులో ఉండేవాడిని..!
బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఏదో ఒక సమయంలో షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్‌ను సందర్శించాలని కోరుకుంటారు.
By: Ramesh Palla | 19 Oct 2025 5:00 PM ISTబాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఏదో ఒక సమయంలో షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్‌ను సందర్శించాలని కోరుకుంటారు. అలాంటి మన్నత్‌లోకి ఎంట్రీ దక్కడం చాలా అరుదుగా దక్కుతుంది. మన్నత్‌కి ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత నేపథ్యంలో అత్యంత భారీ సెక్యూరిటీ ఉంటుంది అనే విషయం తెల్సిందే. మన్నత్ యొక్క సెక్యూరిటీ విషయంలో ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు, ప్రభుత్వ పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. మన్నత్‌లో అడుగు పెట్టే ప్రతి ఒక్కరి గురించి క్షుణంగా తెలుసుకుని, వారు లోనికి తీసుకు వెళ్లే వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోనికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. మన్నత్‌లో అడుగు పెట్టిన వారి గురించి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సిబ్బంది నోట్ చేసుకోవడం, వారికి సంబంధించిన సమాచారం మొత్తం సేకరించడం సెక్యూరిటీ వారు చేసే పని.
షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్‌లోకి..
అంతటి సెక్యూరిటీ ఉన్న మన్నత్‌లోకి ఒకసారి బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య చొరబడ్డాడు అంటూ గతంలో పుకార్లు షికార్లు చేశాయి. అనుమతి లేకుండా, పూర్తి స్థాయిలో వివరాలు సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేయకుండా మన్నత్‌లోకి గుల్షన్ దేవయ్య వెళ్లాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే గుల్షన్ క్లారిటీ ఇస్తూ తాను ఎలాంటి చొరబాటుకు పాల్పడలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో గుల్షన్ దేవయ్య బిజీ అయ్యాడు. ఇటీవల కాంతార చాప్టర్ 1 సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం ద్వారా అందరి గుర్తింపు దక్కించుకుంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. పెద్దగా గుర్తింపు రాని సమయంలోనే గుల్షన్ మన్నత్‌లోకి వెళ్లడం వల్ల ఆయన అనుమతి లేకుండానే, ఆహ్వానం లేకుండానే వెళ్లాడు అంటూ పుకార్లు వచ్చాయి.
గుల్షన్ దేవయ్య పాడ్ కాస్ట్‌లో
తాజాగా గుల్షన్ దేవయ్య ఒక పాడ్‌కాస్ట్‌లో తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా గుల్షన్ గతంలో తన గురించి వచ్చిన అసత్యపు ప్రచారం గురించి స్పందించాడు. మన్నత్ లో నేను షారుఖ్ ఖాన్ గారి ఆహ్వానం మేరకు అడుగు పెట్టాను. ఒకవేళ నేను ఆ ఇంట్లో అనుమతి లేకుండా, ఆహ్వానం లేకుండా అడుగు పెట్టి ఉంటే ఖచ్చితంగా పోలీసులు నన్ను జైల్లో ఉంచేవారు, అక్కడ అనుమతి లేని వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. కనుక నేను కనుక ఆహ్వానం లేకుండా అడుగు పెట్టి ఉంటే జైలుకు వెళ్లాల్సి వచ్చేది. ఆ విషయం అర్థం చేసుకోకుండా కొందరు ఆ సమయంలో అసత్యాలను ప్రచారం చేశారు. షారుఖ్ ఖాన్ గారు ఇచ్చిన సడెన్ పార్టీలో నేను దాదాపు మూడు గంటల పాటు ఉన్నాను అంటూ గుల్షన్ దేవయ్య తాజా పాడ్ కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ స్టార్స్ పలువురు మన్నత్‌లో
మన్నత్‌లో జరిగిన పార్టీకి హాజరు అయిన సమయంలో షారుఖ్ ఖాన్ గారు చాలా బాగా మాట్లాడారు, అంతే కాకుండా గౌరీ ఖాన్ గారు సైతం నాతో చాలా సన్నిహితంగా మాట్లాడారు. అయినప్పటికీ అక్కడి పరిస్థితుల కారణంగా అసౌకర్యంగా అనిపించింది. నటుడు జోయెల్ ఎడ్జెర్టన్ అక్కడ ఉన్నాడు. ఆయనతో నేను ఎక్కువ సమయం మాట్లాడాను. అక్కడే పార్టీలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. అప్పుడు నేను ఆ పార్టీలో చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. ఆ ప్లేస్ కు తాను తగ్గవాడిని కాదు అని చాలా అనుకున్నాను. అందుకే అక్కడ ఫ్రీగా ఉండలేక పోయాను. ఫ్రీగా ఉన్నప్పటికీ అసౌకర్యంగానే అనిపించిందని గుల్షన్ దేవయ్య చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌కు నేను తగిన వాడిని అనుకుంటున్నాను. ఆ ప్లేస్‌కు నేను అర్హుడినే అని ఇప్పుడు నాకు నేను చెప్పుకోగలను అన్నాడు. మన్నత్‌లో హంగు ఆర్భాటాలకు ఆ సమయంలో గుల్షన్ దేవయ్య కాస్త అసౌకర్యంకు గురి అయినట్లు చెప్పకనే చెప్పాడు.
