గల్ఫ్ వార్ మాత్రమే కాదు.. టాక్సిక్ వాయిదా వెనుక మరో పెద్ద కారణం!
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ మరోసారి వార్తల్లో నిలిచింది.
By: Sravani Lakshmi Srungarapu | 9 March 2026 3:52 PM ISTకన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. గోవా డ్రగ్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా మొదట మార్చి 19న రిలీజవాల్సి ఉండగా, తాజాగా జూన్ 4కు వాయిదా పడింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులే ఈ సినిమా వాయిదాకు కారణమని చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పటికీ, అది మాత్రమే కాకుండా వాయిదా వెనుక పలు కీలక అంశాలు కూడా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
గల్ఫ్ దేశాల్లో హీరో యష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. KGF సిరీస్ తర్వాత అక్కడ ఆయనకు పెద్ద మార్కెట్ ఏర్పడింది. అక్కడి థియేటర్లలో తెలుగు, కన్నడ, హిందీ వెర్షన్‌లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అలాంటి కీలక మార్కెట్‌ను కోల్పోవడం నిర్మాతలకు ఇష్టం లేకపోవడం వల్లే సినిమా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సినిమా విడుదల చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన మేకర్స్ జాగ్రత్తగా ముందడుగు వేశారు.
ఇక మరో ముఖ్య కారణం యష్ పర్ఫెక్షనిజం. రీసెంట్ గా మూవీ టీమ్ కు సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా, అందులోని కొన్ని వీఎఫ్ఎక్స్ సీన్స్ ఆయనను పూర్తిగా సంతృప్తి పరచలేదని సమాచారం. దీంతో ఆ షాట్లను తిరిగి రీ వర్క్ చేయాలని యష్ టీమ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, పూర్తి స్థాయిలో సంతృప్తి చెందిన తర్వాతే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన డిసైడైనట్టు తెలుస్తోంది.
అవి కాకుండా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తిగా ముగియలేదని సమాచారం. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై టీమ్ ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఇప్పటికే రిలీజైన టాక్సిక్ ఫస్ట్ సింగిల్‌కు మిక్డ్స్ రెస్పాన్స్ రావడంతో, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌పై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కెజిఎఫ్ తర్వాత యష్ నుంచి వచ్చే మొదటి సినిమా కావడం వల్ల టాక్సిక్ పై అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన కెజిఎఫ్2 తర్వాత ఆయన్నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏ అంశంలోనూ తొందరపడకుండా, పూర్తిస్థాయి అవుట్‌పుట్ సిద్ధమైన తర్వాతే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి టీమ్ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద గల్ఫ్ మార్కెట్ ప్రాధాన్యం, యష్ పర్ఫెక్షనిజం, కెజిఎఫ్ తర్వాత ఏర్పడిన భారీ అంచనాలు.. ఈ మూడు అంశాల వల్లే టాక్సిక్ జూన్ 4కు వాయిదా పడినట్లు స్పష్టమవుతోంది. గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని పనులు పూర్తి చేసుకుని థియేటర్లలోకి రావడానికి ముస్తాబవుతోంది.
