GSTలో మార్పులు.. ఫిల్మ్ ఇండస్ట్రీ సంగతేంటి??
కొత్త మార్పుల వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మంచి అవకాశం కలగనుంది.
By: M Prashanth | 4 Sept 2025 11:44 PM ISTకేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు రెండు శ్లాబులు ఉండనున్నాయని ప్రకటించింది. 5శాతం, 18 శాతంతో రెండు శ్లాబుల విధానాన్ని అనౌన్స్ చేసింది. దీంతో అనేక వస్తువులపై జీఎస్టీ మారనుంది. మరి సినిమా ఇండస్ట్రీ సంగతేంటి? ఎలాంటి మార్పులు రానున్నాయి?
అయితే జీఎస్టీ శ్లాబుల మార్పులతో సినిమా టికెట్ రేట్లపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ రాకతో.. విస్తరణతో ఆదరణ కోల్పోయిన సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఊరట లభించనుంది. వినోదంపై ట్యాక్స్ తగ్గిస్తూ, సినిమా టికెట్లు, థియేటర్లలో విక్రయించే పాప్ కార్న్ పై జీఎస్టీ రేట్లను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
కొత్త మార్పుల వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మంచి అవకాశం కలగనుంది. అయితే తాజాగా నిబంధనల ప్రకారం, రూ.100 లోపు ధర ఉండే టికెట్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అయితే రూ.100 కంటే ఎక్కువ ధర పలికే టికెట్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీ యథాతథంగానే కొనసాగనుంది.
రూ.100 కంటే తక్కువ టిక్కెట్లకు జీఎస్టీలో 7 శాతం తగ్గింపుతో దేశవ్యాప్తంగా ఉన్న చాలా సింగిల్ స్క్రీన్ల టికెట్ ధరలు చౌకగా మారతాయి. ఇది కచ్చితంగా సందర్శకులను పెంచుతుంది. తద్వారా నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులతో సహా సినిమా వాణిజ్యానికి అధిక ఆదాయాన్ని తెస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లు, చిన్న సినిమా హాళ్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) రూ.300 వరకు ఉన్న సినిమా టిక్కెట్లను 5% స్లాబ్ కిందకు తీసుకురావాలని ఇటీవల ప్రభుత్వాన్ని లేఖ రాసింది. అయితే, వారి అభ్యర్థనను జీఎస్టీ కౌన్సిల్ పట్టించుకోలేదు.
రూ.100 వరకు ఉన్న సినిమా టిక్కెట్లపై జీఎస్టీ తగ్గింపు టాలీవుడ్ వాణిజ్యానికి స్వల్పంగా ప్రయోజనం చేకూరుస్తుంది. మార్పుల తర్వాత విడుదల కానున్న మొదటి టాలీవుడ్ బిగ్ మూవీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నిలవనుంది. ఆ తర్వాత మాస్ జతార, ఆంధ్ర కింగ్ తాలూకా, అఖండ 2, ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, జన నాయగన్, రవితేజ RT 76 వంటి పెద్ద బడ్జెట్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు కొత్త మార్పుల వల్ల పెరుగుతాయి.
