విడాకుల ప్రచారానికి చెక్ పెట్టిన సీనియర్ నటుడు!
సీనియర్ నటుడు గోవిందా తన భార్య సునీత అహూజా నుంచి విడాకులు తీసుకుంటున్నారని ఇటీవల ప్రచారమైంది.
By: Sivaji Kontham | 27 Aug 2025 11:47 PM ISTసీనియర్ నటుడు గోవిందా తన భార్య సునీత అహూజా నుంచి విడాకులు తీసుకుంటున్నారని ఇటీవల ప్రచారమైంది. ఇప్పటికే బాంద్రా(ముంబై)లోని ఫ్యామిలీ కోర్టులో పంచాయితీ నడుస్తోంది. సునీత అహూజా అతడిపై క్రూరత్వం, వ్యభిచారం, విడిచిపెట్టి ఉండటం వంటి ఆరోపణలు చేసారని హోటర్ ఫ్లై తన కథనంలో పేర్కొంది. ఆ ఇద్దరూ కౌన్సిలింగ్ కి హాజరు కావాల్సి ఉండగా, గోవిందా స్కిప్ కొడుతున్నారు. సునీత రెగ్యులర్ గా కౌన్సిలింగ్ సెషన్స్ కి హాజరవుతున్నారని సదరు కథనం పేర్కొంది.
అయితే ఈ పుకార్లను ఖండిస్తూ, గోవిందా కుటుంబ స్నేహితుడు ప్రహ్లాజ్ నిహలానీ, అతడి కుమార్తె టీనా అహూజా మీడియాకు వివరణ ఇచ్చారు. ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గోవిందా, అతడి భార్య సునీత అహూజా లార్డ్ గణేషుని చెంత కలవడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా భార్యా భర్తలు కలిసి కనిపించారు. సునీతా అహుజా విడాకుల పుకార్లను ఖండించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అదే సమయంలో గోవింద స్పందన కూడా వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న విడాకుల అంశం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తమ మధ్య ఎలాంటి వివాదం లేదని, తాము గణపతి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చామని సునీత చెప్పారు. ఆ సమయంలో గోవిందా నవ్వు ఆపుకోలేకపోతున్న దృశ్యం కనిపించింది.
గతంలోను సునీత అహూజా తమపై వస్తున్న విడాకుల పుకార్లను ఖండించారు. కాళిక ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా.. తాను చిన్నప్పటి నుండి ఈ ఆలయానికి వస్తున్నానని చెప్పిన సునీత పూజారితో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లతో విలపిస్తూ ``నేను గోవిందను కలిసినప్పుడు అతడితో నాకు సంతోషకరమైన వివాహం జరగాలని ఆ దేవుడిని ప్రార్థించాను. నా కోరికలన్నింటినీ దేవత నెరవేర్చింది. నాకు ఇద్దరు అందమైన పిల్లలను కూడా ఇచ్చింది. కానీ జీవితంలో ప్రతి సత్యం జీర్ణించుకోవడం సులభం కాదు.. ఎల్లప్పుడూ ఎత్తుపల్లాలు ఉంటాయి. అయినప్పటికీ నాకు దేవతపై గొప్ప నమ్మకం ఉంది. ఈ రోజు ఏం జరిగినా, కాళి మాత నన్ను గమనిస్తోందని.. నా ఇంటిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించే ఎవరైనా ఆమెకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని నాకు తెలుసు`` అని ఆవేదనను కనబరిచారు.
నిజానికి గోవిందా- సునీత జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట 1987లో ఒకటయ్యారు. ఈ జంటకు టీనా అహూజా, యశ్వర్థన్ అహూజా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొందర్లోనే యశ్వర్థన్ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నాడు.
