మరో జన్మ ఉంటే ఆయన భర్తగా వద్దు.. హీరో గోవింద భార్య!
ముక్కు సూటిగా ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడేయడం కొందరికే చెల్లింది. అతడు భర్త అయినా తప్పు చేస్తే నిలదీసేందుకు వెనకాడరు.
By: Sivaji Kontham | 10 Nov 2025 7:00 AM ISTముక్కు సూటిగా ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడేయడం కొందరికే చెల్లింది. అతడు భర్త అయినా తప్పు చేస్తే నిలదీసేందుకు వెనకాడరు. ఈ కోవకే చెందుతారు బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా భార్య సునీత అహూజా. ఇటీవల ఈ జంట మధ్య దూరం పెరిగిందని, కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని కథనాలొచ్చాయి. ఆ ఇద్దరూ వేర్వేరుగా నివశిస్తున్నారని కూడా హిందీ మీడియా కథనాలు ప్రచురించింది.
అయితే ఈ జంటపై ఇవన్నీ పుకార్లు మాత్రమేనని దగ్గర బంధువులు కొట్టి పారేసారు. ఈ జన్మకు గోవిందా నుంచి సునీత విడిపోరు! అని కూడా సన్నిహితులు తెలిపారు. అయితే గత కొద్దిరోజులుగా సునీత అహూజా పాడ్ కాస్ట్ లలో మాట్లాడుతూ తన భర్త గోవిందా తప్పు ఒప్పులను ప్రశ్నిస్తుంటే అవన్నీ సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల గోవిందా చుట్టూ స్వామీజీలు, పండిట్ లు భజంత్రీలు చేస్తూ లక్షల్లో కొట్టేస్తుంటారని, వీళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని సునీత అహూజా దారుణంగా తిట్టారు. ఇప్పుడు మరోసారి గోవిందా తనకు సరైన భర్త కాదని వ్యాఖ్యానించారు. మరో జన్మ ఉంటే ఆయన నాకు భర్తగా వద్దని, అతడు అంత మంచి వాడు కాదని సునీత అహూజా సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఎవరైనా చిన్నతనంలో తప్పులు చేయడం సహజం. నేను చేసాను.. గోవిందుడు చేసాడు.. కానీ ఒక వయసు వచ్చాక కూడా తప్పులు చేయకూడదు. మీకు అందమైన భార్య, పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు అలాంటి తప్పులు చేస్తారు? అని సునీత అహూజా ప్రశ్నించారు. గోవిందా తన జీవితంలో భార్యతో కంటే తన హీరోయిన్లతోనే ఎక్కువగా గడిపాడని, చిన్న వయసులో తనకు ఏదీ అర్థం కాలేదని అన్నారు. ప్రతిదీ తెలుసుకోవడానికి 38 ఏళ్ల వైవాహిక జీవితం పట్టిందని వ్యాఖ్యానించారు. ఒక స్టార్ భార్య కావడానికి బలమైన మహిళ కావాలి. మనసును కఠినంగా రాయిలా మార్చుకోవాలి. కానీ చిన్నతనంలో నాకు ఇవేవీ తెలియలేదని సునీత అహూజా ఆవేదన చెందారు.
గోవింద, సునీత అహూజా 1987లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత వారికి టీనా పుట్టేవరకూ పెళ్లిని రహస్యంగా ఉంచారు. కొన్నేళ్లుగా వారిది అందమైన జీవితం. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. కానీ ఈ వయసులో ఆ ఇద్దరి మధ్యా అగ్లీ ఫైట్ కొనసాగుతోంది. ఇటీవల ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని కథనాలొచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని బంధువులు చెబుతున్నారు. వారి మధ్య ప్రస్తుత సంబంధ స్థితి ఎలా ఉందో గందరగోళాన్ని సృష్టిస్తోందని నెటిజనులు అంటున్నారు.
