నా కళ్లతో చూస్తేనే నమ్ముతాను.. నటితో ఎఫైర్‌పై స్టార్ హీరో వైఫ్
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అతడి భార్య నుంచి విడిపోతున్నాడని ఇటీవల ప్రచారమైంది.
By: Sivaji Kontham | 4 Nov 2025 9:54 AM ISTబాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అతడి భార్య నుంచి విడిపోతున్నాడని ఇటీవల ప్రచారమైంది. మరాఠా నటితో ఎఫైర్ నడిపిస్తున్న గోవిందాను అతడి భార్య సునీత అహూజా నిలదీసారని, ఆ ఇద్దరి మధ్యా కొన్నేళ్లుగా కలతల కారణంగా ఎలాంటి సంబంధం లేదని, విడివిడిగా ఉంటున్నారని రకరకాలుగా కథనాలొచ్చాయి.
అయితే ఈ జంట విడిపోతున్నారనే వార్తలను సన్నిహితులు, బంధువులు కొట్టి పారేసారు. ప్రముఖ నిర్మాత, గోవిందా సన్నిహితుడు అయిన ప్రహ్లాజ్ నిహలానీ సైతం ఇవన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టి పారేసారు. తాజా ఇంటర్వ్యూలో గోవిందా ఎఫైర్ విషయంలో అనుమానాలున్నాయా? అని సునీతా అహూజాను ప్రశ్నించగా, తాను స్వయంగా తన కళ్లతో చూసేదానిని మాత్రమే నమ్ముతానని సమాధానం ఇచ్చారు.
నిజానికి గోవిందా- సునీత జంట ప్రేమ వివాహం ఎందరికో ఆదర్శవంతమైన కథ. కానీ ఇటీవల ఈ జంటపై వచ్చిన పుకార్లు చాలా ఇబ్బందికరంగా మారాయి. బాలీవుడ్ మీడియా అత్యుత్సాహం కారణంగా గోవిందా చాలా ఆవేదన చెందారు. ఈసారి `అబ్రా కా దబ్రా` షోలో పరాస్ ఎస్ ఛబ్రాతో పాడ్‌కాస్ట్ చాట్ సందర్భంగా సునీత మరోసారి తమ దాంపత్యంపై వస్తున్న గాసిప్‌లకు ప్రతిస్పందించారు.
ఇదే పాడ్ కాస్ట్ లో మహిళలకు ఆర్థిక భద్రత, ఆర్థిక స్వేచ్ఛ ఎలా ఉండాలో కూడా సునీతా అహూజా మాట్లాడారు. మహిళ తన భర్తను పదిసార్లు అడిగితే ఒకసారి మాత్రమే డబ్బు ఇస్తారు. అలా కాకుండా స్వయంగా డబ్బు సంపాదించడం మహిళలకు చాలా ముఖ్యమని అన్నారు.
నేను ఇప్పుడు వ్లాగింగ్ చేస్తూ సరిపడా సంపాదిస్తున్నాను. వ్లాగింగ్ చేసిన నాలుగు నెలల్లోనే నాకు యూట్యూబ్ సిల్వర్ బటన్ వచ్చింది. ఒక స్త్రీ తనంతట తానుగా నిలబడాలి. మీ డబ్బు మీరే సంపాదిస్తే మరొక స్థాయి ఆనందం కలుగుతుంది. మీ భర్త డబ్బు ఇస్తాడు.. కానీ పది సార్లు అడిగిన తర్వాత ఒకసారి ఇస్తాడు. మీ సంపాదన మాత్రమే మీ సొంతమని సునీత అన్నారు.
గోవిందా ఎప్పుడూ తన స్నేహితులతోనే మిడ్ నైట్ వరకూ పార్టీల్లో గడుపుతాడని సునీత అహూజా ఒక సందర్భంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అతడికి సినిమాలు, స్నేహితులు చాలా ముఖ్యం. భార్య సెకండరి అని కూడా వ్యాఖ్యానించారు. అయితే అతడి నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు వచ్చిన వార్తలను మాత్రం ధృవీకరించలేదు.
