Begin typing your search above and press return to search.

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌రో స్టార్ హీరో కుమారుడు!

బాలీవుడ్ నటుడు గోవింద వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది.

By:  Srikanth Kontham   |   23 Aug 2026 1:00 AM IST
చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌రో స్టార్ హీరో కుమారుడు!
X

బాలీవుడ్ నటుడు గోవింద వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది. గోవింద కుమారుడు యశ్‌వర్ధన్ అహూజా హీరోగా తెరంగేట్రం చేస్తున్న‌ట్లు విష‌యం అధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. సజిద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `హీరో కీ హారరిన్` చిత్రంతో యశ్‌వర్ధన్ సిల్వర్ స్క్రీన్‌పై అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నాడు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే? గోవింద సతీమణి సునీత అహూజా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొడుకు యశ్‌వర్ధన్‌కు తల్లిగా సునీత ఈ సినిమా ద్వారా నటిగా పరిచయం అవుతున్నారు.

సాధారణంగా తల్లిదండ్రులు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పిల్లలు మాత్రమే ఎంట్రీ ఇస్తారు. కానీ ఒకే చిత్రంలో తల్లీకొడుకులు ఇద్దరూ ఒకేసారి లాంచ్ కావడం విశేషం. ఇందులో యశ్‌వర్ధన్‌ సరసన `లాపతా లేడీస్` ఫేమ్ నితాన్షి గోయల్ కథానాయికగా నటిస్తున్నారు. వీరితో పాటు చంకీ పాండే, జేమీ లెవర్, బ్రిజేంద్ర కాల, సిమ్రత్ కౌర్ రంధ్వా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలాజీ టెలిఫిల్మ్స్ జై హో మీడియా వెంచర్స్ పై శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్ , అమర్ బుటాలా ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

హర్రర్, రొమాన్స్ ,కామెడీ జోనర్ల కలబోతగా ఈ సినిమా రూపొందనుంది. క‌థ‌లో హాస్యం ప్ర‌ధానంగా హైలైట్ కానుంద‌ని స‌మాచారం. ఈ సినిమాతో దర్శకుడు సజిద్ ఖాన్ కూడా సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి మెగాఫోన్ ప‌డుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి చిత్రాన్ని 2027 జనవరి 7న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

గోవింద కుటుంబం నుంచి మరో నటుడిగా అడుగుపెడుతున్న యశ్‌వర్ధన్ అహూజాకు తొలి సినిమా ఎంతవరకు పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో తీవ్ర‌మైన పోటీ ఉంది. ఓవైపు వార‌సులు మ‌రో వైపు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌స్తోన్న న‌టులు మంచి విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. వార‌స‌ల నుంచి పోటీ ప‌క్క‌న బెడితే? ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లే స‌క్సెస్ అవుతున్నారు.

బ‌ల‌మైన కంటెంట్ ను వారు ఎంచుకోవ‌డంలో ప్ర‌త్యేక‌త క‌నిపిస్తుంది. చిన్ని సినిమాగా మొద‌లై రిలీజ్ అయిన త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని వంద‌ల కోట్లు వ‌సూళ్లు సాధిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ల‌కంటే లేని వాళ్లు హిట్ కొడితే అది రాక్ సాలిడ్ గా ఉంటుంద‌ని కొంత మంది యంగ్ హీరోలు ఇప్ప‌టికే ప్రూవ్ చేసారు. ఇలాంటి పోటీని య‌శ్ వ‌ర్ద‌న్ త‌ట్టుకుని మార్కెట్ లో నిల‌బ‌డాలి.