Begin typing your search above and press return to search.

90 స్ డేస్ లోకి వెళ్లిపోయిన అందాల న‌టి!

90ల నాటి బాలీవుడ్ చిత్రాలలో గోవిందా- కరిష్మా కపూర్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది.

By:  Srikanth Kontham   |   25 May 2026 3:00 PM IST
90 స్ డేస్ లోకి వెళ్లిపోయిన అందాల న‌టి!
X

90ల నాటి బాలీవుడ్ చిత్రాలలో గోవిందా- కరిష్మా కపూర్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఇద్ద‌రి కలయికలో రిలీజ్ అయిన `కూలీ నెం. 1` (1995) అప్పట్లో ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలోని `హుస్న్ హై సుహానా` అనే ఐకానిక్ డ్యాన్స్ నంబర్ ఇప్పటికీ ఎంతో మంది అభిమానులను ఊపేస్తూనే ఉంది. తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న కరిష్మా కపూర్ ఆ పాట చిత్రీకరణ సమయంలో తాను ఎదుర్కొన్న ఒత్తిడిని, ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. `ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్` రియాలిటీ షో ప్రీమియర్ ఎపిసోడ్‌కు కరిష్మా కపూర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఒక కంటెస్టెంట్ `హుస్న్ హై సుహానా" పాటకు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయడంతో కరిష్మా ఒక్కసారిగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళిపోయారు.

ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆ పాట షూటింగ్ సమయంలో తాను విపరీతమైన ఆందోళనకు, కంగారుకు లోనయ్యానని బహిరంగంగా వెల్లడించారు. ఆ సమయంలో తన వయస్సు 17 లేదా 18 ఏళ్లు మాత్రమేనని, ఆ వయస్సులో ఇండస్ట్రీలోనే టాప్ పెర్ఫార్మర్ అయిన గోవిందా వంటి స్టార్ హీరోతో కలిసి డ్యాన్స్ చేయాల్సి రావడం పెద్ద బాధ్యతగా అనిపించిందని కరిష్మా చెప్పారు. స్క్రీన్‌పై గోవిందా ఇచ్చే ఎనర్జీని అందుకోవడం, ఆయన టైమింగ్‌కు మ్యాచ్ చేయడం అనేది ఒక నూతన నటికి ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని ఆమె పేర్కొన్నారు.

ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడమే తన భయానికి ప్రధాన కారణమని వివరించారు. గోవిందాతో కలిసి నటించడమే కాకుండా ఆ పాటతో మరో కొత్త కలయిక కూడా తోడైందని కరిష్మా తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్‌తో ఆమెకు అది మొదటి లేదా రెండవ పాట. అటు హీరో గోవిందాతో సరిసమానంగా చేయాలి. ఇటు కొత్త కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కంపోజిషన్‌ను సరిగ్గా ప్రెజెంట్ చేయాలి. అందుకే ఆ కాంబినేషన్ తనకు ఎంతో కొత్తగా ఒత్తిడితో కూడుకున్నదిగా అనిపించిందని కరిష్మా గుర్తుచేసుకున్నారు. అయితే సెట్స్‌లో తన భయాన్ని పోగొట్టడానికి దర్శకుడు డేవిడ్ ధావన్ ఎంతో సహాయం చేశారని కరిష్మా కపూర్ కృతజ్ఞతతో స్మరించుకున్నారు.

షూటింగ్ సమయంలో కరిష్మా దగ్గరకు వచ్చిన డేవిడ్ ధావన్.. ఆయన (గణేష్ ఆచార్య) ఎంతో ప్రతిభావంతుడైన కొత్త మాస్టర్` అని పరిచయం చేస్తూ ధైర్యం చెప్పారు. ఆ సమయంలో కరిష్మా ఎంత సిగ్గుపడుతూ కూర్చున్నారో, మాస్టర్ గణేష్ ఆచార్య కూడా అంతే మొహమాటపడుతూ ఉన్నారని ఆ తర్వాత చిత్రబృందం అంతా కలిసి వారిద్దరికీ ఐటమ్ సాంగ్ ప్రాముఖ్యతను, గోవిందాతో ఎలా డ్యాన్స్ చేయాలో వివరించి కంఫర్టబుల్‌గా మార్చారని తెలిపారు. ఆ విధంగా అందరి ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న ఆ పాట నేటికీ ఎవర్‌గ్రీన్ చార్ట్‌బస్టర్‌గా నిలిచిపోయింది. మూడు దశాబ్దాలు దాటినా ఈ పాటకున్న క్రేజ్ తగ్గకపోవడం విశేషం.