Begin typing your search above and press return to search.

చేతులు జోడించి క్ష‌మాప‌ణ‌లు కోరిన న‌టుడు!

తన సెక్యూరిటీ చేసిన పొరపాటును గ్రహించి అక్కడికక్కడే సదరు పాపరాజోకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు.

By:  Srikanth Kontham   |   19 May 2026 7:00 PM IST
చేతులు జోడించి క్ష‌మాప‌ణ‌లు కోరిన న‌టుడు!
X

బాలీవుడ్ సీనియర్ హీరో- డాన్స్ ఐకాన్ గోవిందా వెండితెరపైనే కాదు. నిజ జీవితంలోనూ తనదైన లౌక్యంతో, మంచి ప్రవర్తనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమా ఈవెంట్లలో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటారు. అయితే ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్‌లో గోవింద‌ పాల్గొన్న సమయంలో ఊహించని విధంగా ఓ వివాదం చోటుచేసుకుంది. గోవిందా వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందికి - అక్కడ కవరేజ్ కోసం వచ్చిన పాపరాజో కు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ ఉద్రిక్త వాతావరణాన్ని గోవిందా హ్యాండిల్ చేసిన తీరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి గోవిందా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ సమయంలో ఆయనను క్లోజ్-అప్‌లో షూట్ చేయడానికి ఫోటోలు తీయడానికి మీడియా ప్రతినిధులు, పాపరాజీలు పోటీ పడ్డారు. ఈ రద్దీలో గోవిందా భద్రతను పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఒక ఫోటోగ్రాఫర్‌ను నెట్టేయడంతో వివాదం మొదలైంది. సదరు ఫోటోగ్రాఫర్ కూడా తీవ్రంగా నిరసన తెలపడంతో ఇరు వర్గాల మధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం అలుముకుంది. తన కళ్ల ముందే జరుగుతోన్న గొడవను చూసిన గోవిందా ఏమాత్రం అలసత్వం వహించలేదు. తన హోదాను చూసుకుని మౌనంగా ఉండిపోకుండా? వెంటనే జోక్యం చేసుకున్నారు.

తన సెక్యూరిటీ చేసిన పొరపాటును గ్రహించి అక్కడికక్కడే సదరు పాపరాజోకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. మీడియా ప్రతినిధులు పడే కష్టాన్ని తాను గౌరవిస్తానని, వారిని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని నమ్రతగా వ్యవహరించారు. గోవిందా చూపించిన లౌక్యం, పెద్దరికం వల్ల పెద్ద గొడవ క్షణాల్లో సర్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు గోవిందాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా కొందరు స్టార్ సెలబ్రిటీలు తమ సెక్యూరిటీ మీడియాపై దాడులు చేసినా లేదా దురుసుగా ప్రవర్తించినా పట్టించుకోకుండా కార్లు ఎక్కి వెళ్ళిపోతుంటారు.

కానీ గోవిందా మాత్రం తన ఈగోను పక్కన పెట్టి తప్పు ఎవరిదైనా సరే తనే స్వయంగా క్షమాపణ చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనమని నెటిజన్లు కొనియాడుతున్నారు. అందుకే ఆయనను అందరూ జెంటల్‌మెన్ అని పిలుస్తారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాదం తో సెలబ్రిటీల పబ్లిక్ లైఫ్ -వారి సెక్యూరిటీ ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది. ప్రమోషన్లు, ఈవెంట్ల సమయంలో స్టార్లను కవర్ చేయడానికి మీడియా పడే ఆరాటం అదే సమయంలో వారిని సురక్షితంగా తీసుకెళ్లడానికి బాడీగార్డ్స్ చూపే అతి ఉత్సాహం మధ్య ఇలాంటి ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే సెలబ్రిటీలు తమ భద్రతా సిబ్బందికి మీడియా పట్ల ఎలా నడుచుకోవాలో ముందే కఠినమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మ‌రోసారి నిరూపిస్తోంది.