యువ నటి బాడీ షేమింగ్ విషయంతో దద్దరిల్లుతున్న కోలీవుడ్
తమిళ సూపర్ హిట్ మూవీ 96 సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి రోల్ లో కనిపించి బాగా పాపులరయ్యారు గౌరీ కిషన్
By: Sravani Lakshmi Srungarapu | 8 Nov 2025 10:51 AM ISTతమిళ సూపర్ హిట్ మూవీ 96 సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి రోల్ లో కనిపించి బాగా పాపులరయ్యారు గౌరీ కిషన్. ఇదే సినిమా తెలుగులో జాను పేరుతో రీమేక్ అవగా, అందులో కూడా నటించి తెలుగు ఆడియన్స్ ను దగ్గరయ్యారు గౌరీ. 96 తర్వాత మంచి క్రేజ్ రావడంతో గౌరీ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా గౌరీ కిషన్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది.
అదర్స్ ప్రెస్ మీట్ లో గౌరీకి ఇబ్బందికర ప్రశ్న
గౌరీ కిషన్ రీసెంట్ గా అబిన్ హరికరణ్ దర్శకత్వంలో నటించిన అదర్స్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించగా, అక్కడ గౌరీకి రిపోర్టర్ నుంచి ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు గౌరీ మొదట సహనంతో సమాధానమిచ్చారు. తర్వాత ఆ రిపోర్టర్ తన ప్రశ్నను సమర్థించుకోవడంతో గౌరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా గౌరీ రియాక్షన్ కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గౌరీ బరువు గురించి ప్రశ్నించిన రిపోర్ట్
మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా హీరో ఆదిత్య మాధవన్ ను సినిమాలోని ఓ సీన్ లో గౌరీని ఎత్తడం గురించి, ఆమె బరువు గురించి అడగ్గా, ఆ ప్రశ్నకు గౌరీ రియాక్ట్ అయి, ఓ ప్రొఫెషనల్ ఈవెంట్ లో అలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని మహిళల పట్ల బాడీ షేమింగ్ ను ప్రతిబింబిస్తుందని కౌంటరిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, సోషల్ మీడియాలో సెలబ్రిటీలు గౌరీకి మద్దుతుగా నిలుస్తూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను ఖండిస్తున్నారు.
జర్నలిజం సున్నితత్వాన్ని కోల్పోయింది
గౌరీ ఈ విషయంపై వెంటనే రెస్పాండ్ అయి తన వైఖరిని నిలబెట్టుకుందని, ఓ యువ నటి బహిరంగంగా అగౌరవాన్ని ప్రకటించడం చాలా ఉత్తేజకరంగా అనిపించిందని సింగర్ చిన్మయి ప్రశంసించగా, యాక్టర్ కవిన్ గౌరీని ఇన్‌స్పైరింగ్ అని అభివర్ణించారు. ఖుష్బు సుందర్ దీనిపై మాట్లాడుతూ, జర్నలిజం సున్నితత్వాన్ని కోల్పోయినప్పుడే ఇలాంటి ప్రశ్నలు వస్తాయని, ఒక మహిళ బరువు గురించి అడగాల్సిన అవసరం ఎవరికీ లేదని, గౌరీ దీనిపై స్ట్రిక్ట్ గా రియాక్ట్ అయినందుకు మెచ్చుకున్నారు.
ఈ విషయంలో రిచా చద్దా, పార్వతి తిరువోతు, గుత్తా జ్వాలా, పా. రంజిత్, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ కూడా గౌరీకి సపోర్ట్ గా నిలిచారు. సినిమాలో తన క్యారెక్టర్ గురించి కానీ, సినిమా కథ గురించి కానీ మాట్లాడకుండా తన బాడీ గురించి రిపోర్టర్ మాట్లాడటంతో తాను నిరాశ చెందానని, అక్కడ తానొక్కటే మహిళ ఉండటం వల్ల తనను టార్గెట్ చేశారని, ఇది చాలా దురదృష్టకరమని అనగా, చెన్నై ప్రెస్ క్లబ్ తర్వాత సదరు జర్నలిస్ట్ ప్రవర్తనను ఖండిస్తూ, బాడీ షేమింగ్ కు వ్యతిరేకంగా నిలబడిన గౌరీకి మద్దతిచ్చింది. ఇక అదర్స్ మూవీ విషయానికొస్తే ఆదిత్య మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
