నీట్ విద్యార్థులకు అండగా టాలీవుడ్ హీరోయిన్.. పోస్టర్లతో నిరసన!
ప్రముఖ సినీ నటి గౌరీ జి కిషన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మలయాళ బ్యూటీ అయిన ఈమె తెలుగు ,తమిళ్ చిత్రాలలో నటిస్తూ ఆడియన్స్ ను అలరిస్తోంది.
By: Madhu Reddy | 23 July 2026 12:13 PM ISTప్రముఖ సినీ నటి గౌరీ జి కిషన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మలయాళ బ్యూటీ అయిన ఈమె తెలుగు ,తమిళ్ చిత్రాలలో నటిస్తూ ఆడియన్స్ ను అలరిస్తోంది. ఇక తొలిసారి 2018లో త్రిష ప్రధాన పాత్రలో వచ్చిన 96 అనే తమిళ చిత్రంలో త్రిష చిన్నప్పటి పాత్ర పోషించి అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసిన ఈమె.. ఇదే చిత్రాన్ని తెలుగులో జాను పేరిట రీమేక్ చేయగా అందులో కూడా త్రిష చిన్నప్పటి పాత్ర పోషించి మెప్పించింది. ఇకపోతే ఈమె తెలుగులో నేరుగా నటించిన చిత్రం మాత్రం శ్రీదేవి శోభన్ బాబు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించగా.. గౌరీ జి కిషన్ హీరోయిన్గా నటిస్తూ తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమయ్యింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుష్మిత, విష్ణు ప్రశాంత్ నిర్మించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
విద్యార్థులకు అండగా సినీ సెలబ్రిటీలు..
ప్రస్తుతం ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈమె.. మరొకవైపు విద్యార్థులకు అండగా నిలిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. నీట్ పరీక్షల్లో అవకతవకలు ఏర్పడిన కారణంగా కొంతమంది విద్యార్థులు మరణించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్లు చేస్తున్నారు సీజేపీ కార్యకర్తలు. ఈ నిరసన సెగ ముంబై, హైదరాబాద్, కేరళ వంటి ప్రధాన నగరాలను కూడా తాకింది. అందులో భాగంగానే విద్యార్థులకు అండగా సినీ సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
సల్మాన్ ఖాన్ తో పాటు గౌరీజి కిషన్ కూడా..
ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ విద్యార్థులకు అండగా నిలుస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు గౌరీ జి కిషన్ కూడా కేరళలోని కొచ్చిలో ఉన్న మహారాజా కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, తన మద్దతు పలికింది. అందులో ఆమె ఏకంగా ఒక పోస్టర్ పట్టుకొని నిరసన ప్రదర్శనకు వచ్చింది. ఇక ఆమె పట్టుకున్న పోస్టర్లో "శాంతియుతంగా చెబితే ప్రతి మాట ప్రజాస్వామ్యం వింటుంది" అంటూ రాసి ఉన్న పోస్టర్ ను పట్టుకొని ప్రదర్శన ఇచ్చింది. ఇకపోతే గౌరీ జి కిషన్ ఇప్పుడు విద్యార్థులకు అండగా ఇలా పోస్టర్లతో ప్రదర్శన ఇస్తూ అందరిని ఆకట్టుకుంది.
నీట్ విద్యార్థులకు మద్దతుగా సెలబ్రిటీలు..
ఇకపోతే ఈ నిరసనల్లో గౌరీ జి కిషన్ తో పాటు ప్రముఖ సినీ నటులు శాంతి బాలచంద్రన్, ప్రియా వారియర్, గోపికా రమేష్, శాంతి బాలచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. దర్శకులు మహేష్ నారాయణన్ తోపాటు ఆశిక్ అబు హాజరుకాగా .. నటులు జోజు జార్జ్ కూడా వచ్చారు. మరి కొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ నిరసనలు తెలిపారు. ఇక వీరితోపాటు హైదరాబాద్ నుండి ప్రకాష్ రాజ్ కూడా సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
