'గాసిప్'తో జీవితాలు ఎలా మారతాయో చూపించే సినిమా మాది: రాశీ
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. 'గాసిప్ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఒక చిన్న గాసిప్ కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో చిత్రంలో చూపించాం.
By: M Prashanth | 23 Jun 2026 8:57 PM ISTచిన్న గాసిప్ కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందో చూపించే కథతో తెరకెక్కిన చిత్రం గాసిప్ అని ఆ మవీ టీమ్ చెబుతోంది. యంగ్ బ్యూటీ రాశీ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తాజాగా నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మూవీ యూనిట్ తమ అనుభవాలను పంచుకుంది.
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. 'గాసిప్ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఒక చిన్న గాసిప్ కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో చిత్రంలో చూపించాం. ఇది నా తొలి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో కొంత బాధ్యతతో పాటు భయం కూడా ఉంది. దర్శకుడు వైభవ్ నాపై నమ్మకం ఉంచి ఛాన్స్ ఇచ్చారు. నిర్మాత యతి ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు అవసరమైన సహకారం అందించారు. నటిగా మాత్రమే కాకుండా డ్యాన్స్ పరంగా కూడా కొత్తగా ప్రయత్నించాను. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను' అని రాశీ తెలిపారు.
చిత్ర దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ.. 'మన జీవితాల్లో గాసిప్ అనేది సాధారణ విషయమే. అయితే మనం సరదాగా మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. ఇందులో నా జీవితంతో పాటు నా స్నేహితుల జీవితాల్లో జరిగిన కొన్ని నిజ సంఘటనలు కూడా ఉన్నాయి' అని చెప్పారు.
నిర్మాత యతి మాట్లాడుతూ మంచి కథాంశంతో రూపొందిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు వైభవ్ పనితీరు, కథను చెప్పే విధానం ప్రత్యేకంగా ఉంటాయని పేర్కొన్నారు. నటుడు మహేష్ యడ్లపల్లి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు దగ్గరగా ఉండే అంశాన్ని సినిమాలో చూపించామని తెలిపారు. ప్రేక్షకులకు ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
నటుడు గురు చరణ్ మాట్లాడుతూ దర్శకుడు వైభవ్ కు స్టోరీ, రోల్స్ పై అవగాహన ఉందని చెప్పారు. షూటింగ్, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తయిందని తెలిపారు. నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ మంచి విషయం కంటే చెడు విషయం వేగంగా స్ప్రెడ్ అయ్యే నేటి పరిస్థితులను ఆ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుందని అన్నారు. సమాజంపై వ్యక్తుల చర్యల ప్రభావాన్ని తన పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు.
ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ వైభవ్ స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చారని ప్రశంసించారు. గాసిప్ మూవీ టీమ్ కు విషెస్ తెలుపుతూ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. సోషల్ సెటైర్ తో పాటు ప్రేమకథ, భావోద్వేగాలను మిక్స్ చేస్తూ రూపొందిన గాసిప్ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తోందని మూవీ టీమ్ తెలిపింది.
