Begin typing your search above and press return to search.

రాశీ సింగ్ 'గాసిప్' ట్రైలర్.. గాసిప్స్ ఎంత డేంజర్ అంటే?

గాసిప్ మూవీ స్టోరీ అజంత అనే మిడిల్ క్లాస్ యువతి చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా వీణ ఆర్టిస్ట్ గా ఎదగాలని కలలు కనే ఆమె జీవితంలో ఒక గాసిప్ ఊహించని మార్పులకు కారణమవుతుంది.

By:  M Prashanth   |   23 Jun 2026 8:43 PM IST
రాశీ సింగ్ గాసిప్ ట్రైలర్.. గాసిప్స్ ఎంత డేంజర్ అంటే?
X

హీరోయిన్ రాశీ సింగ్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాసిప్. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌ పై యతి నిర్మిస్తున్న ఆ సినిమాకు వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా, రూమర్లు, గాసిప్స్ ఎఫెక్ట్ చూపించే సోషల్ సెటైర్‌ గా ఆ మూవీ రూపొందుతోంది. జూన్ 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది.

గాసిప్ మూవీ స్టోరీ అజంత అనే మిడిల్ క్లాస్ యువతి చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా వీణ ఆర్టిస్ట్ గా ఎదగాలని కలలు కనే ఆమె జీవితంలో ఒక గాసిప్ ఊహించని మార్పులకు కారణమవుతుంది. ఒక చిన్న పుకారు ఎలా పెద్ద సమస్యగా మారి పర్సనల్ లైఫ్ ను ఎఫెక్ట్ చేస్తుందనే అంశాన్ని దర్శకుడు కథలో ప్రధానంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ ను కలిగించే విధంగా సాగింది. లవ్, ఫ్యామిలీ రిలేషన్స్, పర్సనల్ డ్రీమ్స్ వంటి అంశాలను గాసిప్‌ల వల్ల ఏర్పడే పరిణామాలతో మిక్స్ చేసి చూపించారు. ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి పూర్తి నిజాలు తెలియకుండానే సమాజం తీర్పులు ఇవ్వడం వల్ల కలిగే నష్టాన్ని సినిమాలో ప్రస్తావించినట్లు కనిపిస్తోంది.

అజంత పాత్రలో రాశీ సింగ్ యాక్టింగ్ ట్రైలర్‌ కు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. అమాయక యువతిగా కనిపించే ఆమె, అనంతరం పరిస్థితుల కారణంగా ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, అవమానాలను ఎమోషనల్‌ గా చూపించిటన్లు ట్రైలర్‌ లో కనిపిస్తోంది. పాత్రలోని ఎమోషన్స్ ఆమె నేచురల్ గా చూపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రైలర్‌ లో కథకు సంబంధించిన కొన్ని ట్విస్ట్‌లను కూడా చూపించారు.

అయితే పూర్తి కథను బయటపెట్టకుండా ఆసక్తిని కొనసాగించే ప్రయత్నం చేశారు. దీంతో సినిమా అసలు కథ ఏంటి? అజంత జీవితంలో వచ్చిన మార్పులకు కారణమైన గాసిప్ ఏమిటి? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ ట్రైలర్‌ కు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఎఫెక్ట్ క్లియర్ గా కనిపించింది. సతీష్ అందించిన సినిమాటోగ్రఫీ, జై కుమార్ ఎడిటింగ్ కూడా ట్రైలర్‌ ను ఆకట్టుకునేలా మార్చాయి.

రవివర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఆ సినిమాలో మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో రూమర్ ఒకరి లైఫ్ ను ఎంతగా ఎఫెక్ట్ చేయగలదో చూపించే ప్రయత్నంగా గాసిప్ సినిమా కనిపిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్‌ ను నమ్ముకుని రూపొందించిన ఆ సినిమా ట్రైలర్‌ తో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మరి సినిమా రిలీజైన తర్వాత ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.