నైట్ యాక్షన్ లో మ్యాచో స్టార్!
ఈ నైట్ షెడ్యూల్ పూర్తయితే మేజర్ పార్ట్ షూట్ పూర్తయినట్లేనని చిత్ర వర్గాల సమాచారం. అలాగే ఈ సినిమా కోసం టాప్ క్లాస్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.
By: Srikanth Kontham | 26 Jan 2026 9:45 AM ISTమ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఓ చారిత్రక యాక్షన్ ఎపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 7వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక ఘట్టం ఆధారంగా రూపొందుతుంది. ఇందులో గోపీచంద్ వారియర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే గోపీచంద్ న్యూ లుక్ ఆకట్టుకుంటుంది. పాత్ర లో మ్యాచోస్టార్ మేకోవర్ ఎంతో కొత్తగా ఉంది. పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో పూర్తిగా న్యూలుక్ లో అదర గొడు తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ వైరల్ అవుతోంది. షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
భారీ క్లైమాక్స్ సహా కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో జరుగుతోంది. ఈ ఒక్క క్లైమాక్స్ కోసమే దాదాపు 25 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ అంతా పూర్తిగా రాత్రిపూటే జరుగుతోంది. ఇందులో గోపీచంద్ సహా ప్రధాన పాత్రలపై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఏ హీరో ప్రయత్నించని రేంజ్‌లో ఈ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం. స్టంట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
ఈ నైట్ షెడ్యూల్ పూర్తయితే మేజర్ పార్ట్ షూట్ పూర్తయినట్లేనని చిత్ర వర్గాల సమాచారం. అలాగే ఈ సినిమా కోసం టాప్ క్లాస్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. సంకల్ప్ కొంత మంది హాలీవుడ్ టెక్నిషియన్లను హైర్ చేసుకు న్నాడుట. సీజీ, విజువల్ ఎఫెక్స్ట్ కి సంబంధించిన పార్ట్ పై హాలీవుడ్ టెక్నిషియన్లు పని చేస్తున్నారుట. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు.
ఈ సినిమా విజయం కూడా గోపీచంద్-సంకల్ప్ లకు కీలకం. గోపీచంద్ కొంత కాలంగా ప్లాప్ ల్లోనే ఉన్నాడు. సరైన హిట్ పడి చాలా కాలమవుతుంది. చేస్తోన్న ఏ ప్రయత్నం ఫలించడం లేదు. సరిగ్గా అదే సమయంలో సంకల్ప్ స్టోరీ వినిపించడం..హిస్టారికల్ కాన్సెప్ట్ కావడంతో? మరో ఆలోచన లేకుండా లాక్ చేసాడు. సంకల్ప్ కూడా `ఘాజీ` తర్వాత హిట్ అందుకోలేదు. రెండు..మూడు సినిమాలు చేసినా ఫలితాలు నిరాశ పరిచాయి. మంచి టెక్నీషియన్ గా పేరు వచ్చినా? కొత్త అవకాశాలు అందుకోవడంలో వెనుబడ్డాడు. దీంతో సంకల్ప్ విజయం కోసం కసిగా పని చేస్తున్నాడు.
