గోపీచంద్ 'భరతవర్ష'.. మేకర్స్ నమ్మకమేంటి?
ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. గ్లింప్స్ విడుదలైన వెంటనే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
By: M Prashanth | 14 April 2026 1:45 PM ISTయాక్షన్ హీరో గోపీచంద్ మరో భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరుసగా నిరాశలు ఎదుర్కొన్న తర్వాత ఈసారి సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న ఆయన.. పూర్తిగా భిన్నమైన కథతో భరతవర్ష సినిమాతో రాబోతున్నారు. ఆ చిత్రాన్ని ఘాజీ ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. గ్లింప్స్ విడుదలైన వెంటనే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. వీడియోలో గోపీచంద్ యోధుడి గెటప్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. యుద్ధరంగంలో శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటూ చేసే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎలిమెంట్స్.. అన్నీ కలిసి సినిమా గ్రాండ్ గా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తున్నాయి. అదే సమయంలో భరతవర్ష టైటిల్ కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం భరతవర్షం అంటే హిమాలయాల నుంచి సముద్రం వరకు విస్తరించిన అఖండ భారతదేశాన్ని సూచిస్తుంది. చక్రవర్తి భరతుడి పేరుమీదుగా ఆ పేరు ఏర్పడిందని చరిత్ర చెబుతోంది.
ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే.. సినిమా దేశభక్తి, చరిత్ర, మైథాలజీ ఎలిమెంట్స్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్రానికి ముందు కాలానికి చెందిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా చిత్రం ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే గ్లింప్స్ వచ్చిన తర్వాత మరో అంశం హాట్ టాపిక్ గా మారింది.. అదే మేకర్స్ నమ్మకం. గ్లింప్స్ ద్వారా సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులు, హై వోల్టేజ్ సన్నివేశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
రిచ్ విజువల్స్, గ్రాండ్ సెటప్.. అన్నీ కలిపి భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద బడ్జెట్ సినిమాలు కొత్త విషయం కాదు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న.. ఆ రేంజ్ పెట్టుబడికి మేకర్స్‌కు ఉన్న నమ్మకం ఏమిటన్నదే. నిజానికి గోపీచంద్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు పదేళ్లుగా ఆయనకు పెద్ద సక్సెస్ దక్కలేదు.
మరోవైపు, సంకల్ప్ రెడ్డి కూడా ఘాజీ తర్వాత అదే స్థాయిలో మరో భారీ విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రావడం ఆసక్తికరంగా మారింది. అయితే కంటెంట్ పై మేకర్స్ కు గట్టి నమ్మకం ఉందని తెలుస్తోంది. కథ బలం, విజువల్ ప్రెజెంటేషన్, యాక్షన్ స్కేల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని వారు భావిస్తున్నారని సమాచారం. అందుకే పెద్ద ఎత్తున ఖర్చుతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భరతవర్ష మూవీ అంచనాలు ఎంతవరకు అందుకుంటుంది? మేకర్స్ నమ్మకం ఎంత వరకు నిలబడుతుంది? అన్నది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.
