తారక్ తో త్రివిక్రమ్ మూవీ.. మళ్లీ డౌటేంటి?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాపై మరోసారి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
By: M Prashanth | 20 Jan 2026 12:00 AM ISTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాపై మరోసారి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. గాడ్ ఆఫ్ వార్ పేరుతో ఆ ప్రాజెక్టు తెరకెక్కబోతోందన్న ప్రచారం జరుగుతుండగా.. తాజాగా హీరో మారుతున్నాడన్న వార్తలు వినిపించడంతో తారక్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది.
నిజానికి కొద్ది రోజుల క్రితం యంగ్ ప్రొడ్యూసర్ సూర్యవంశీ.. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందించబోతున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ చేతిలో మురుగ అనే పుస్తకం కనిపించడంతో మూవీకి మురుగ – గాడ్ ఆఫ్ వార్ టైటిల్ ఫిక్స్ అయ్యిందని అభిమానులు భావించారు. ఎన్టీఆర్ బుక్ పట్టుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రాజెక్టుపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
గతంలో త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా వీరి కలయికలో మరో సినిమా అనౌన్స్ అయినప్పటికీ, ఆ ప్రాజెక్టు వివిధ కారణాల వల్ల సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ వీరి కలయికపై నాగవంశీ ప్రకటన ఇవ్వడంతో తారక్ అభిమానులు హ్యాపీ అయ్యారు. సినిమాలో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతున్నాడని భావించారు.
అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూర్తయ్యాక.. త్రివిక్రమ్ కు డేట్లు ఇవ్వాలని ఎన్టీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నాడన్న ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టు గాడ్ ఆఫ్ వార్ హీరో మారుతున్నాడన్న వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముందుగా ఆ సినిమాకు అల్లు అర్జున్ అనుకున్నారని, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారని, తరువాత అల్లు అర్జున్ మరోసారి జాయిన్ అవ్వబోతున్నారు అని అన్నారు ....ఇప్పుడు కొత్తగా రామ్ చరణ్ వద్దకు కథ వెళ్లిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దీంతో అసలు హీరో ఎవరు అనే ప్రశ్న మళ్లీ చర్చకు వచ్చింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో పూర్తిగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తుండగా, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ చిత్రం చేయనున్నారు. అందుకే ఇప్పుడు కొత్త ప్రాజెక్టు వెంటనే అంగీకరించే అవకాశం తక్కువగా ఉందని సమాచారం.
ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం సినిమా తెరకెక్కిస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నారు. అప్పటికి ఎన్టీఆర్ ఖాళీ అవుతారట. దీంతో హీరోను మార్చే అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వినిపిస్తోంది. ముఖ్యంగా ఆ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాకపోవడమే ఊహగానాలకు కారణంగా మారింది. అందుకే అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే హీరో ఎవరు, కథ ఏంటన్న విషయంపై స్పష్టత వస్తుంది.
