ఓటీటీ టాక్: నెట్‌ఫ్లిక్స్'గ్లోరీ' టాక్ ఏంటి?
ఈ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్‌లుగా దాదాపు ఆరు గంటల నిడివితో సాగుతుంది. శక్తీగర్ అనే ఊరిలో బాక్సింగ్ కోచ్ రఘుబీర్ సింగ్, ఆయన కొడుకులు రవి, దేవ్‌ల చుట్టూ కథ తిరుగుతుంది.
By: M Prashanth | 3 May 2026 5:23 PM ISTనెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ డ్రామాల హడావుడి బాగానే కనిపిస్తోంది. సాధారణంగా ఆటల నేపథ్యంలో వచ్చే కథల్లో గెలుపు ఓటములు, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే లేటెస్ట్ గా విడుదలైన ‘గ్లోరీ’ వెబ్ సిరీస్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఒక డార్క్ అండ్ రా కోణంలో సాగుతుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథపై చూసిన ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది ఇదొక కొత్త తరహా ప్రయత్నం అని చెబుతుంటే, మరికొందరు లెంగ్త్ ఎక్కువైందని అభిప్రాయపడుతున్నారు.
ఈ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్‌లుగా దాదాపు ఆరు గంటల నిడివితో సాగుతుంది. శక్తీగర్ అనే ఊరిలో బాక్సింగ్ కోచ్ రఘుబీర్ సింగ్, ఆయన కొడుకులు రవి, దేవ్‌ల చుట్టూ కథ తిరుగుతుంది. తన సోదరిపై దాడి చేసిన వాడిని పట్టుకోవడానికి ఇద్దరు అన్నదమ్ములు చేసే ప్రయత్నం, ఆ క్రమంలో బాక్సింగ్ రింగ్‌లో ఎదురయ్యే సవాళ్లు ఈ కథలో మెయిన్ పాయింట్స్. అయితే ఇది కేవలం ఆటల గురించి మాత్రమే కాకుండా, స్పోర్ట్స్ వెనుక ఉండే పాలిటిక్స్, తండ్రీకొడుకుల మధ్య ఉండే గ్యాప్ ను కూడా చూపిస్తుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ప్రకారం, ఈ సిరీస్‌లో నటీనటుల పెర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్‌గా నిలుస్తోంది. బాక్సర్‌గా పుల్కిత్ సామ్రాట్ ఫిజిక్, యాక్టింగ్ బాగుందని, తన క్యారెక్టర్‌లో ఉన్న కసిని బాగా పండించాడనే టాక్ వినిపిస్తోంది. దివ్యేందు శర్మ తనదైన గంభీరమైన నటనతో ఆకట్టుకోగా, తండ్రి పాత్రలో సువిందర్ విక్కీ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. కాశ్మీరా పరదేశీ ఒక డిఫరెంట్ షేడ్ ఉన్న రోల్ లో సర్ప్రైజ్ చేసిందని, టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిరీస్ మూడ్ ను బాగా సెట్ చేశాయని చూసిన వారు చెబుతున్నారు.
అయితే స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం నెటిజన్ల నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. కథలో చాలా సబ్ ప్లాట్స్ ఉండటం వల్ల అసలు పాయింట్ పక్కదారి పట్టినట్లు అనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆసక్తికరంగా ఉన్నా, మధ్యలో వచ్చే కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉండటంతో నిడివి పెరిగిపోయిందని, అది ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారిందనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రవి, అరవింద్ పాత్రల మధ్య వచ్చే లవ్ ట్రయాంగిల్ సీన్లు కథ ఫ్లోను దెబ్బతీశాయని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
ఇక ‘గ్లోరీ’ ఒక యూనిక్ స్పోర్ట్స్ డ్రామా అని, తండ్రులు తమ పిల్లలపై రుద్దే భారం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇందులో బోల్డ్ గా చూపించారని మెజారిటీ ప్రేక్షకులు చెబుతున్నారు. అమీర్ ఖాన్ 'దంగల్' కు ఇది పూర్తి ఆపోజిట్ గా ఉంటుందని, తల్లిదండ్రులు చూడాల్సిన సిరీస్ అని నెట్టింట చర్చ సాగుతోంది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, క్రైమ్, స్పోర్ట్స్ మిక్స్ అయిన కథలను ఇష్టపడే వారికి ఇది ఒకసారి చూడదగ్గ ఆప్షన్ అని నెటిజన్లు సజెస్ట్ చేస్తున్నారు.
