Begin typing your search above and press return to search.

హీరోల‌కు సమ ఉజ్జీగా నిలిచిన విలక్షణ నటుడు గిరిబాబు

ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. 1973లో ‘జగమే మాయ’తో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   14 Nov 2026 7:45 PM IST
హీరోల‌కు సమ ఉజ్జీగా నిలిచిన విలక్షణ నటుడు గిరిబాబు
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన గంభీరమైన గొంతు.. విలక్షణమైన నటనతో ఐదు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు, దర్శక‌నిర్మాత గిరిబాబు (యర్రా శేషగిరిరావు). హీరోగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆయన మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ మృతిపై చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, సీనియర్ టెక్నీషియన్లు, తోటి నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలను, క్రమశిక్షణను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

గిరిబాబు సినీ కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని అరుదైన ఘటనల గురించి సినీ వర్గాలు నేడు ప్రత్యేకంగా స్మరించుకుంటున్నాయి. ముఖ్యంగా 1973లో `జగమే మాయ` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన గిరిబాబు.. ఆ తర్వాత వచ్చిన చాలా చిత్రాల్లో అప్పటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి దిగ్గజాలతో సమఉజ్జీగా నటించి మెప్పించారు. సాధారణంగా హీరోల ముందు విలన్ పాత్రలు కాస్త తగ్గి కనిపించే రోజుల్లో.. గిరిబాబు తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో.. పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో పోటీపడుతూ నటించడం గిరిబాబు కెరీర్‌లోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచింది.

అంతేకాకుండా... ఒక నటుడిగా బిజీగా ఉంటూనే దర్శకుడిగా, నిర్మాతగా మారి ఆయన సాధించిన విజయం జీవితంలో మరో మరపురాని ఘట్టం. తన కుమారుడు రఘుబాబును వెండితెరకు పరిచయం చేయడంతో పాటు.. తను నిర్మించిన చిత్రాల్లో కొత్త టెక్నీషియన్లకు, కళాకారులకు అవకాశాలిచ్చి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ, వి. మధుసూదనరావు వంటి దిగ్గజ దర్శకుల చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు.. సెట్స్‌లో సాంకేతిక నిపుణులతో మమేకమయ్యే తీరు నేటికీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తుంటాయి.

నటుడిగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఏనాడూ గర్వం అనేదే లేని నిరాడంబరత గిరిబాబు సొంతమని సీనియర్ టెక్నీషియన్లు గుర్తు చేసుకుంటున్నారు. చిన్న ఆర్టిస్టుల నుండి అగ్ర హీరోల వరకు అందరితో ఒకేలా ఆప్యాయంగా పలకరించే ఆయన వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. భౌతికంగా గిరిబాబు మన మధ్య లేకపోయినా.. హీరోలకు దీటుగా ఆయన పోషించిన ఆణిముత్యాల్లాంటి పాత్రలు.. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని పరిశ్రమ వర్గాలు నివాళులు అర్పిస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న న‌టుడు గిరిబాబు 80ఏళ్ల వ‌య‌సులో ప‌ర‌మ‌ప‌దించారు.