Begin typing your search above and press return to search.

ఫ్యాష‌న్ లెజెండ్‌కి దిగ్గ‌జ తార‌ల సంతాపం

దిగ్గ‌జ‌ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ గురువారం తుది శ్వాస విడిచార‌ని విన్న త‌ర్వాత ఫ్యాష‌న్ ప్ర‌పంచం నివ్వెర‌పోయింది.

By:  Sivaji Kontham   |   5 Sept 2025 9:25 AM IST
ఫ్యాష‌న్ లెజెండ్‌కి దిగ్గ‌జ తార‌ల సంతాపం
X

దిగ్గ‌జ‌ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ గురువారం తుది శ్వాస విడిచార‌ని విన్న త‌ర్వాత ఫ్యాష‌న్ ప్ర‌పంచం నివ్వెర‌పోయింది. ఆయ‌న వ‌య‌సు 91. ఈ రోజు ఫ్యాషన్ ఇండ‌స్ట్రీకి చీకటి రోజు. లెజెండ‌రీ ఫ్యాష‌న్ డిజైన‌ర్ కి హాలీవుడ్ ప్ర‌ముఖులు డెమీ మూర్, జులియా రాబ‌ర్ట్స్ స‌హా బాలీవుడ్ నుంచి ప‌లువురు సంతాపం తెలియ‌జేసారు.

ముఖ్యంగా బాలీవుడ్ ఫ్యాష‌నిస్టా సోనమ్ కపూర్ ఈ వార్త విన్న వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలో సంతాపం తెలిపారు. భార‌తీయ వినోద ప‌రిశ్ర‌మ నుంచి సంతాపం ప్ర‌క‌టించిన‌ మొదటి ప్ర‌ముఖురాలు సోన‌మ్. లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్‌తో క‌లిసి ఉన్న‌ప్ప‌టి తన ఫోటో ఒక‌టి షేర్ చేసిన సోన‌మ్ ... త‌న ఫేవ‌రెట్ ఆర్మానీని మిస్ అవుతున్నామ‌ని ఆవేద‌న వ్యక్తం చేసారు.

కింగ్ జార్జియోగా పాపుల‌రైన అర్మానీ మోడ్ర‌న్ ట‌చ్ ఉన్న ఫ్యాష‌న్ సెన్స్ తో అసాధార‌ణ ప్ర‌యోగాలు చేసి అంద‌రినీ ఆక‌ర్షించారు. అత‌డు రూపొందించిన ప్ర‌త్యేక‌మైన‌ సూట్లు, మినిమలిస్ట్ డిజైన్లు ఫ్యాషన్ ప్రపంచంలో నిశ్శబ్ద విప్లవాన్ని తెచ్చిపెట్టాయి. అత‌డు కేవ‌లం డిజైన‌ర్ మాత్ర‌మే కాదు.. మంచి వ్యాపార‌వేత్త కూడా. బిలియన్ల యూరోల వార్షిక టర్నోవర్‌తో ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన ఫ్యాషన్ హౌస్ ల‌ను నిర్వ‌హించిన ప్ర‌ముఖుడు.

అర్మానీ గ్రూప్ నిర్వాహ‌కుడు అత‌డు. ప్రజలు నివాళులర్పించడానికి సెప్టెంబర్ 6, 7 తేదీలలో మిలన్‌లో ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. తరువాత ఒక ప్రైవేట్ వేడుకలో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. ఈ ఏడాది జూన్ నుంచి అనారోగ్య కార‌ణాల‌తో ఆయ‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.