Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ ఫ్యామిలీకి మరో షాక్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నా, ఫ్యామిలీ మాత్రం వరుస షాక్‌లను ఎదుర్కొంటోంది.

By:  M Prashanth   |   9 Sept 2025 3:14 PM IST
అల్లు అర్జున్ ఫ్యామిలీకి మరో షాక్
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నా, ఫ్యామిలీ మాత్రం వరుస షాక్‌లను ఎదుర్కొంటోంది. ఇటీవల అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ, తర్వాత ఆయన మిత్రుడు నాగరాజు మరణం ఫ్యామిలీని కుదిపేసింది. ఆ దుఃఖం తగ్గకముందే ఇప్పుడు జీహెచ్‌ఎంసీ నుంచి ఒక ఊహించని నోటీసు రావడం కొత్త చర్చకు దారి తీసింది.

ఇక అసలు విషయం ఏమిటంటే, జూబ్లీహిల్స్‌లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం జరగిందని జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. దీనిపై సర్కిల్ 18 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. “ఎందుకు కూల్చకూడదో వివరించండి” అంటూ నోటీసులో పేర్కొన్నారు. ఇది బయటకు రావడంతో అల్లు ఫ్యామిలీకి మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

సుమారు ఏడాది క్రితం నిర్మాత అల్లు అరవింద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో వెయ్యి గజాల స్థలంలో ‘అల్లు బిజినెస్ పార్క్’ నిర్మించారు. ఆ సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో నాలుగు అంతస్తులకు అధికారిక అనుమతులు పొందారు. అయితే, తాజాగా ఆ నాలుగు అంతస్తులపై అనుమతులు లేకుండా ఒక పెంట్ హౌస్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఇది పూర్తి స్థాయిలో నిబంధనలకు వ్యతిరేకమని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.

ఇప్పుడీ పెంట్ హౌస్ నిర్మాణంపై బల్దియా తీవ్రంగా స్పందించింది. త్వరలోనే చట్ట ప్రకారం ఆ నిర్మాణాన్ని కూల్చివేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. అక్రమంగా నిర్మాణం కొనసాగించడంపై జరిమానాలు విధించే అవకాశమూ ఉందని సమాచారం. ఈ పరిణామంతో అల్లు ఫ్యామిలీ పెద్ద టెన్షన్‌లో పడింది.

ఒకవైపు సినీ ప్రాజెక్ట్‌లు, మరోవైపు ఇలాంటి లీగల్ ఇష్యూలు ఎదురవడం అల్లు అరవింద్‌కు పెద్ద సవాలుగా మారింది. అభిమానులు మాత్రం ఫ్యామిలీకి వరుసగా ఎదురవుతున్న ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బల్దియా నోటీసు వ్యవహారం చివరికి ఏ దిశగా వెళుతుందో చూడాలి.