ఘట్టమనేని ఫ్యామిలీకి కూడా మెగా ఫ్యామిలీ లా సక్సెస్ రేట్ లభిస్తుందా?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఘట్టమనేని, నందమూరి, అక్కినేని, అల్లు, మెగా, మంచు, దగ్గుబాటి ఇలా ఎన్నో బడా ఫ్యామిలీలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి.
By: Madhu Reddy | 30 Aug 2025 4:00 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఘట్టమనేని, నందమూరి, అక్కినేని, అల్లు, మెగా, మంచు, దగ్గుబాటి ఇలా ఎన్నో బడా ఫ్యామిలీలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ కుటుంబాల నుంచి వచ్చిన చాలామంది హీరోలుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. కానీ మెగా ఫ్యామిలీకి ఉన్నంత సక్సెస్ రేటు మరే కుటుంబానికి లభించలేదు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే నందమూరి కుటుంబం నుండి రెండు మూడు జనరేషన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రేంజ్ లో మిగతావారు సక్సెస్ కాలేదు. ఉదాహరణకు నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా అడుగుపెట్టిన తారకరత్న, చైతన్య కృష్ణ హీరోలుగా నిలదొక్కుకోలేకపోయారు. ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ కిడ్ నందమూరి ఎన్టీఆర్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. మరి ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
అటు అక్కినేని కుటుంబం నుండి సుమంత్, అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ నాగార్జున రేంజిలో సక్సెస్ అందుకోలేదు. నాగచైతన్య కనీసం అప్పుడప్పుడు హిట్స్ కొడుతున్నారు కానీ అఖిల్ కైతే ఇప్పటివరకు సరైన సక్సెస్ లభించలేదు. ఇక మెగా ఫ్యామిలీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కుటుంబం నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా చాలామంది హీరోలుగా అడుగుపెట్టారు. వీరందరూ కూడా దాదాపుగా సక్సెస్ చవిచూసిన వారే..అటు అల్లు కుటుంబం విషయానికి వస్తే.. అల్లు అర్జున్ మినహా అల్లు శిరీష్ తన అన్నయ్య రేంజ్ లో సక్సెస్ కాలేదు.
ఇలా బడా ఫ్యామిలీల నుండి చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. భారీ సక్సెస్ అయితే అందుకోలేక పోయారు. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం వంతు వచ్చింది. అందులో భాగంగానే.. ఘట్టమనేని కుటుంబ వారసులు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి తమ తొలి సినిమాను ప్రకటించారు. వాస్తవానికి ఈ కుటుంబం నుంచి ఇప్పటికే మహేష్ బాబు, దివంగత నటుడు రమేష్ బాబు , సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబుతో పాటు కృష్ణ మనవడు అశోక గళ్ళ ఇలా చాలామంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ మహేష్ బాబు రేంజ్ లో ఏ ఒక్కరు సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు దివంగత నటులు రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణతోపాటు ఆయన కూతురు ఘట్టమనేని భారతి ఇండస్ట్రీలోకి హీరో హీరోయిన్లుగా అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు తమ తొలి సినిమా కూడా ప్రకటించారు.
ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా.. అజయ్ భూపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' అనే టైటిల్ తో జయ కృష్ణ తన తొలి సినిమాను ప్రకటించారు. అక్టోబర్ 15వ తేదీన లాంచనంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా నటిస్తోంది. అటు రమేష్ బాబు కూతురు భారతి కూడా ఇప్పుడు సినిమాల్లోకి రాబోతోంది. ప్రముఖ డైరెక్టర్ తేజ కొడుకు తొలి మూవీలో హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే కొంతమేర రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరిగింది త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు. అసలే ఘట్టమనేని ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణ పరంపరను మహేష్ బాబు మాత్రమే కొనసాగిస్తున్నారు.. ఇక కనీసం వీరిద్దరైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని తాత, బాబాయ్ ల సినిమా పరంపరను కొనసాగిస్తారా? మెగా ఫ్యామిలీ లా సక్సెస్ రేట్ అందుకుంటారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
