Begin typing your search above and press return to search.

8 ఏళ్ల కఠిన శిక్షణ: న‌ట‌న‌లో ఘట్టమనేని వార‌సుడి క‌సి- ప‌ట్టుద‌ల‌!

తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Sivaji Kontham   |   24 July 2026 9:19 AM IST
8 ఏళ్ల కఠిన శిక్షణ: న‌ట‌న‌లో ఘట్టమనేని వార‌సుడి క‌సి- ప‌ట్టుద‌ల‌!
X

తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్‌స్టార్ కృష్ణ వార‌సుడిగా మ‌హేష్ బాబు నేడు టాలీవుడ్ లో సూప‌ర్‌స్టార్ గా ఏల్తున్నారు. ఇప్పుడు ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ.. మహేష్ బాబు అన్నయ్య దివంగత రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన `శ్రీనివాస మంగాపురం` చిత్రం ద్వారా జయకృష్ణ వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఇదే సినిమాతో ర‌వీనా టాండ‌న్ కుమార్తె రాషా త‌డానీ టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా జూలై 29న విడుదల కానున్న నేపథ్యంలో.. ఘట్టమనేని అభిమానులు జయకృష్ణలో అత‌డి తండ్రి రమేష్ బాబు ప్రతిరూపాన్ని చూసుకుంటూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఏదో స్టార్ కిడ్ హోదా ఉంది కదా అని తొందరపడకుండా... కథానాయకుడిగా మారడానికి జయకృష్ణ దాదాపు 8 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, కఠినమైన శిక్షణ తీసుకున్నారు. పరిశ్రమలోకి అడుగుపెట్టే ముందే నటన, డాన్స్, ఫైట్స్‌లో పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. స్థానికంగానే కాకుండా ముంబైలోని `కాంత్` అనే ప్రైవేట్ కోచ్ వద్ద శిక్షణ పొందడంతో పాటు ప్రముఖ `ఆదిశక్తి` థియేటర్ గ్రూప్‌లో వర్క్‌షాప్‌లు చేశారు. అంతటితో ఆగకుండా అంతర్జాతీయ స్థాయిలో న్యూయార్క్‌లోని ప్ర‌ఖ్యాత `లీ స్ట్రాస్‌బర్గ్` ఫిల్మ్ అండ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్‌లో దాదాపు రెండేళ్ల పాటు నటనలో మెళకువలు నేర్చుకోవడం జ‌య‌కృష్ణ‌కు సినిమాపై ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తోంది.

నటన - వినోద రంగంపై తనకున్న స్పష్టమైన దృక్పథాన్ని ఇటీవల ఇచ్చిన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో జయకృష్ణ రివీల్ చేసారు. నటన అనేది కేవలం పుస్తకాల్లోనో.. స్కూళ్లలోనో నేర్చుకునే విద్య మాత్రమే కాదని.. అది అనుభవం - ఆత్మవిశ్వాసంతో రూపుదిద్దుకుంటుందని విశ్లేషించారు. ఎంతటి దిగ్గజ నటులైనా ప్రతి కొత్త పాత్రతో నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారని పేర్కొన్నారు. యాక్టింగ్ స్కూళ్లలో పొందిన శిక్షణకు... నేరుగా షూటింగ్ సెట్‌లో కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఉండే అనుభవానికి తేడా ఉన్నా... తాను తీసుకున్న గ్లోబల్ ట్రైనింగ్ తనలో కొండంత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని జయకృష్ణ తెలిపారు.

కేవలం నటనపైనే కాకుండా స్క్రీన్ ప్రెజెన్స్.. యాక్షన్ సీక్వెన్సుల కోసం కూడా జయకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చిన్నప్పటి నుంచే ఉన్న ఆసక్తితో జిమ్నాస్టిక్స్, తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్‌లో తగిన నైపుణ్యం సాధించారు. అలాగే డాన్స్, యాక్షన్ కంపోజిషన్స్‌లో ప్రత్యేక శిక్షణ పొంది... ఒక పక్కా యాక్షన్ అండ్ ఎమోషనల్ హీరోకి కావలసిన అన్ని అర్హతలను సొంతం చేసుకున్నారు. పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాకే ఇండస్ట్రీకి రావడం తన బాధ్యతగా భావించినట్లు ఈ డెబ్యూ హీరో వెల్లడించారు.

తాత సూపర్‌స్టార్ కృష్ణ బాడీ లాంగ్వేజ్, శాంతం, మెస్మరైజ్ చేసే మేనరిజమ్స్ జయకృష్ణలో కనిపిస్తుండటంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బాబాయి మహేష్ బాబు అందించిన ప్రోత్సాహంతో.. అజయ్ భూపతి మేకింగ్ విజన్ తో వస్తున్న `శ్రీనివాస మంగాపురం` చిత్రం జయకృష్ణ కెరీర్‌కు సరైన పునాది వేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. త‌న కష్టానికి ప్రతిఫలంగా జూలై 29న రాబోతున్న ఈ చిత్రం జయకృష్ణను టాలీవుడ్‌లో ఒక ప్రామిసింగ్ హీరోగా నిలబెడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.