Begin typing your search above and press return to search.

మహేష్ బాబు ఫ్యామిలీ నుండీ 6మంది వారసులు!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని, మెగా, ఘట్టమనేని, మంచు, నందమూరి ఇలా కొన్ని కుటుంబాలకు ప్రత్యేకమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   29 Oct 2025 1:50 PM IST
మహేష్ బాబు ఫ్యామిలీ నుండీ 6మంది వారసులు!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని, మెగా, ఘట్టమనేని, మంచు, నందమూరి ఇలా కొన్ని కుటుంబాలకు ప్రత్యేకమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కుటుంబాల నుండీ ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తున్నారు. అయితే ఇలాంటి దిగ్గజ ఫ్యామిలీల నుండీ ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక కుటుంబం నుంచీ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 6 మంది వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. మరి వారెవరు? ఏ కుటుంబం నుంచీ వస్తున్నారు? ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.





తాజాగా ఒకే ఫ్యామిలీ నుండి 6 మంది వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అదే ఘట్టమనేని కుటుంబం.. ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ తో మొదలైన ఈ సినీ ప్రయాణం... ఇప్పుడు వారి వారసులు..వారి వారసుల ఎంట్రీకి కూడా రంగం సిద్ధం అవుతోంది. మరి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న ఆ వారసుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ..

ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ ఇండస్ట్రీకి అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెకు కూడా ఇది తొలి చిత్రం కావడం గమనార్హం.

దివంగత నటుడు రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని..

దివంగత నటుడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ మాత్రమే కాదు కూతురు భారతి ఘట్టమనేని కూడా ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయిపోయింది. ఇంస్టాగ్రామ్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న భారతి.. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తన మొదటి సినిమా చేస్తోంది. ఇందులో హీరోతోపాటు తదితర విషయాలు తెలియాల్సి ఉంది.

సుధీర్ బాబు కొడుకులు చరిత్, దర్శన్..

మహేష్ బాబు బావగా.. ప్రముఖ సినీ హీరోగా పేరు సొంతం చేసుకున్న సుధీర్ బాబు కూడా తన ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. అందులో ఒకరు చరిత్ కాగా , మరొకరు దర్శన్. చరిత్ ప్రస్తుతం ఇండస్ట్రీ ఎంట్రీ కి సిద్ధమవుతుండగా.. మరొకవైపు దర్శన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే మహేష్ బాబు నిర్మిస్తున్న అడవి శేషు గూడచారి 2 లో కూడా దర్శన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మంజుల కుమార్తె జాహ్నవి..

ప్రముఖ సినీనటి మహేష్ బాబు సోదరి, ఘట్టమనేని కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంజుల.. హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలనుకుంది. కానీ కృష్ణ అభిమానుల కోరిక మేరకు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైంది. అలాంటి ఈమె ఇప్పుడు తన కూతుర్ని హీరోయిన్ గా చేసి తన కోరికను నెరవేర్చుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే జాహ్నవి ఇప్పుడు హీరోయిన్గా అరంగేట్రం చేస్తోంది. జాహ్నవి ఇదివరకే మనసుకు నచ్చింది అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని..

ప్రస్తుతం మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని కూడా ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అయితే ఈయన ఫిలిం అకాడమీలో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఇలా వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.