విలక్షణ విలనీ కేరాఫ్ ప్రదీప్ రావత్.. ఆయన ఇక లేరు!
సినీ పరిశ్రమలో తన విలక్షణ నటన.. మకఠినమైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) కన్నుమూశారు.
By: Sivaji Kontham | 4 Aug 2026 9:47 PM ISTసినీ పరిశ్రమలో తన విలక్షణ నటన.. మకఠినమైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రముఖ నేపాలీ నటి విపనా థాపా ధృవీకరించారు.
భారతీయ చిత్రసీమలో ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రదీప్ సింగ్ రావత్ గొప్ప నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు. బిఆర్ చోప్రా పాపులర్ టెలివిజన్ సిరీస్ `మహాభారత్`లో అశ్వత్థామ పాత్ర ద్వారా అతడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో సర్ఫరోష్, లగాన్, ..ముఖ్యంగా `గజినీ` (సూర్య) వంటి సంచలన చిత్రాలలో ఆయన పోషించిన విలన్ పాత్రలు సినీ ప్రియుల మనస్సుల్లో నిలిచిపోయాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన `సై` చిత్రంలో భిక్షు యాదవ్ పాత్రలో భయంకరుడిగా క్రూరుడిగా అతడు కనబరిచిన అభినయం టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చాలా తెలుగు చిత్రాలలో ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.
భారతీయ భాషలతో పాటు నేపాలీ చిత్రసీమలో కూడా ప్రదీప్ రావత్ తన ప్రతిభను చాటుకున్నారు. దర్శకుడు చంద్ర పంత్ దర్శకత్వంలో వచ్చిన `ఆబాత్ ఆమా`,`ఆబాత్ ఆమా-2` , `హ్రస్వ దీర్ఘ` వంటి నేపాలీ చిత్రాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాల్లో నటి విపనా థాపాతో కలిసి ఆయన నటించారు.
ప్రదీప్ సింగ్ రావత్ ఆకస్మిక మరణంతో సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నటి విపనా థాపా సోషల్ మీడియా వేదికగా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయగా... భారతీయ సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మృతితో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది.
