Begin typing your search above and press return to search.

100 కోట్ల క్ల‌బ్ హీరోయిన్ స‌డెన్‌గా అదృశ్యం వెన‌క కార‌ణం?

ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి గ్లామ్ అండ్ గ్లిజ్ ప్రపంచానికి దూరంగా ఒక నిరాడంబరమైన.. అత్యంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

By:  Sivaji Kontham   |   7 May 2026 6:00 PM IST
100 కోట్ల క్ల‌బ్ హీరోయిన్ స‌డెన్‌గా అదృశ్యం వెన‌క కార‌ణం?
X

టాలీవుడ్‌లో `గ‌జిని` సినిమాతో 100 కోట్ల క్లబ్ నాయికగా స‌త్తా చాటింది అసిన్. అలాగే ర‌వితేజ `అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి` చిత్రంతో తెలుగువారి గుండెల్లో నిలిచింది. గ‌జిని బ్లాక్ బస్ట‌ర్ కొట్టాక అశిన్ కెరీర్ వెనుదిరిగి చూసుకున్న‌దే లేదు. ఇటు త‌మిళం- తెలుగు, అటు హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో మంచి పేరు తెచ్చుకుంది. ప‌లు బ్లాక్ బస్టర్ చిత్రాలతో సౌత్ నుంచి నార్త్ వరకు టాప్ హీరోయిన్ గా అశిన్ ఎదిగారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే తన ప్రేమ కోసం.. కుటుంబం కోసం.. గ్లామర్ ప్రపంచానికి స్వస్తి చెప్పి ఏకంగా తన సినీ కెరీర్‌నే త్యాగం చేయడం అప్పట్లో ఒక సంచలనం. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి గ్లామ్ అండ్ గ్లిజ్ ప్రపంచానికి దూరంగా ఒక నిరాడంబరమైన.. అత్యంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

అసిన్ తన నిజజీవిత భాగస్వామిగా `మైక్రోమ్యాక్స్` అధినేత రాహుల్ శర్మను ఎంచుకోవడం వెనుక ఒక సినిమాటిక్ ఘ‌ట‌న‌ దాగి ఉంది. `గజిని` చిత్రంలో ఒక సెల్ ఫోన్ కంపెనీ యజమానితో ప్రేమాయణం నడిపించినట్లే నిజ జీవితంలోనూ ఒక అగ్రశ్రేణి సెల్ ఫోన్ కంపెనీ అధినేతతోనే ప్రేమలో పడటం విశేషం. వీరిద్దరి కలయికకు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ వారధిగా నిలిచారు. `ఖిలాడీ 786` షూటింగ్ సమయంలో అక్షయ్ వీరిని ఒకరికొకరికి పరిచయం చేయగా అది కాస్తా ప్రేమగా మారింది. ఈ జంట‌ 2016 జనవరిలో హిందూ- క్రిస్టియన్ పద్ధతుల్లో ఘనంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ద‌శాబ్ధ కాలంగా ఈ బంధం మ‌రింత ధృఢంగా సాగుతోంది. దాదాపు 1400 కోట్ల నికర ఆస్తులున్న ఒక భారీ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండి కూడా, తన భార్యను కేవలం జీవన సహచరిగానే కాకుండా.. తన జీవితానికి .. కుటుంబానికి ఒక `కో-ఫౌండర్`(సహ వ్యవస్థాపకురాలు) ఆయ‌న ప‌ద‌వినిచ్చి గౌర‌వించారు. గడిచిన పదేళ్లు ఒక అందమైన ప్రయాణంలా సాగాయి.. ఆమె నా జీవితంలో ఒక అద్భుతమైన శక్తి! అంటూ రాహుల్ ఆనందం వ్య‌క్తం చేస్తుంటారు.

వివాహానంతరం సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పిన అసిన్ తన కుమార్తె అరిన్ భవిష్యత్తుపై పూర్తి దృష్టి సారించారు. అరిన్ కూడా తల్లి లాగే డ్యాన్స్ - స్పోర్ట్స్ వంటి విషయాల్లో ఎంతో చురుగ్గా ఉన్నట్లు అసిన్ అప్పుడప్పుడు షేర్ చేసే ఫోటోల ద్వారా తెలుస్తోంది. పారిశ్రామికవేత్తగా రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ ఇన్‌ఫర్మాటిక్స్‌తో పాటు, రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ వంటి రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నారు. 2025-26 నాటి అంచనాల ప్రకారం.. ఆయన ఆస్తి విలువ సుమారు 1400 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. ఇంతటి సంపన్న‌డు త‌న‌కు భ‌ర్త అయినా.. అసిన్ తన జీవితాన్ని ఎంతో సింపుల్ గా మ‌లుచుకోవ‌డం ఆస‌క్తిక‌రం.

సాధారణంగా స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సినిమాలను వదిలేయడానికి ఇష్టపడరు. కానీ అసిన్ మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని.. ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వ్య‌క్తిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒక స్టార్‌గా ఎంతటి గుర్తింపు పొందారో.. ఇప్పుడు ఒక గృహిణిగా, తల్లిగా అంతకంటే ఎక్కువ సంతృప్తిని పొందుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. క‌థానాయిక‌గా కోట్లాది మంది అభిమానాన్ని ద‌క్కించుకున్న‌ ఈ తమిళమ్మాయి ఇప్పుడు తన చిన్నపాటి కుటుంబ ప్రపంచంలోనే అసలైన విజయాన్ని ఆస్వాధిస్తోంది.