గ్రేట్ ఆర్టిస్ట్ `అపోకలిప్టో` ఫేం తారాసేనా మృతి
అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి దిగ్గజ ఓటీటీల రాకతో చాలా హాలీవుడ్ సినిమాల అనువాదాలను నేరుగా తెలుగు భాషలో వీక్షించే వెసులుబాటు వచ్చింది.
By: Sivaji Kontham | 4 Feb 2026 11:06 AM ISTఅమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి దిగ్గజ ఓటీటీల రాకతో చాలా హాలీవుడ్ సినిమాల అనువాదాలను నేరుగా తెలుగు భాషలో వీక్షించే వెసులుబాటు వచ్చింది. అంతకుముందే జెమిని నెట్ వర్క్ లో తేజ అనే చానల్ లో చాలా తెలుగు అనువాద చిత్రాలను ప్రజలు వీక్షించారు. చాలా హాలీవుడ్ సినిమాలను తెలుగులో వీక్షించే సౌలభ్యాన్ని టెలివిజన్ అందిస్తోంది. ఇటీవల టెలివిజన్, ఓటీటీలు, యూట్యూబ్‌లు కూడా హాలీవుడ్ సినిమాల అనువాదాలను అందిస్తున్నాయి.
దీని కారణంగా హాలీవుడ్ సినిమాల్లో నటించే నటీనటుల గురించి కూడా తెలుగు ప్రజలు తెలుసుకుంటున్నారు. తమ అభిమాన హీరో లేదా నటీనటుల గురించి గూగుల్‌లో ఆరాలు తీస్తున్నారు. ఫలానా హాలీవుడ్ నటుడు అంటూ సులువుగా గుర్తు పట్టేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక ప్రముఖ హాలీవుడ్ స్టార్ మరణం చర్చగా మారింది. అపోకలిప్టో సినిమాతో భారతదేశంలోను గొప్ప ఫాలోయింగ్ పెంచుకున్న మెక్సికన్ నటుడు జెరార్డో తారాసేనా అభిమానుల హృదయాల్లో విషాదం నింపారు.
తాజా సమాచారం మేరకు అతడు 55 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన మరణం మెక్సికన్ సినిమాకే కాకుండా, ప్రపంచ సినిమా రంగానికి కూడా తీరని లోటు. అపోకలిప్టో సినిమాలో ఆయన పోషించిన `మిడిల్ ఐ` పాత్ర మర్చిపోలేనిది. ఆ పాత్రలో అతడిని తప్ప వేరొకరిని ఊహించలేము అనే రేంజులో నటించి చూపించాడు. అతడు ప్రదర్శించిన క్రూరత్వం సినిమాకే హైలైట్. అతడి నటన ప్రేక్షకులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.
జెరార్డో కేవలం నటుడు మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. అతడి మెక్సికన్ స్టైల్ నృత్యాలకు అసాధారణ ఫాలోయింగ్ ఉంది. ఇక అతడు తన శరీర కదలికల్ని అద్భుతంగా తన నటన, పాత్రకు అన్వయించుకోగల నేర్పరి.
`అపోకలిప్టో` చిత్రంలో తమ నాయకుడి ఆజ్ఞల్ని పాటిస్తూ, ప్రత్యర్థి గూడెం(గిరిజన విలేజీ)పై దండెత్తి ప్రజల్ని అపహరించేవాడిగా, అతడు అత్యంత క్రూరుడిగా నటించాడు. గూడెం ప్రజల్ని బానిసలుగా మార్చుకుని ఒక చోటి నుంచి ఇంకో చోటికి తరలించేప్పుడు వారికి చూపించే కర్కశుడి పాత్రలో నటించాడు గెరార్డ్. తన కెరీర్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ లో సాధించిన ఘనతకు తగ్గట్టు పురస్కారాల్ని గెలుచుకున్నారు. మెక్సికన్ సినిమా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఏరియల్ అవార్డును గెరార్డ్ గెలుచుకున్నారు. 55 ఏళ్ల పిన్న వయసులో అతడు మరణించడాన్ని అభిమాన లోకం జీర్ణించుకోలేకపోతోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రపంచవ్యాప్త అభిమానులు కోరుకుంటున్నారు.
మెల్ గిబ్సన్ సినిమా గెట్ ద గ్రింగో, హిందీ చిత్రం `కైట్స్`లోను గెరార్డ్ తారా సేనా నటించాడు. కైట్స్ లో అతడి నటనకు అద్భుత ప్రశంసలు దక్కాయి. జెరార్డో తారా సేనా 2010లో విడుదలైన `కైట్స్` చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో అతడు ఇస్మాయిల్ అనే మెక్సికన్ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో నటించాడు. నేరగాళ్లను పట్టుకునే బౌంటీ తరహా పాత్ర అయినా కానీ ఇది నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర. హీరో (హృతిక్ రోషన్), హీరోయిన్ (బార్బరా మోరీ) విలన్ల నుండి తప్పించుకుని మెక్సికో సరిహద్దుల గుండా పారిపోతుంటారు. వారిని పట్టుకోవడానికి విలన్ పంపిన అత్యంత క్రూరమైన వ్యక్తిగా ఇస్మాయిల్ కనిపిస్తాడు. ఈ సినిమాలో నటించిన గెరార్డ్ భారతీయ నటుడైన హృతిక్ రోషన్ పై ప్రశంసలు కురిపించాడు. అతడి అంకితభావాన్ని అతడు గొప్పగా కీర్తించారు.
