టాలీవుడ్ వైపు టాక్సిక్ బ్యూటీ!
మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రతిభావంతురాలైన దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇప్పుడు టాలీవుడ్ పై కన్నేసినట్లు సమాచారం.
By: Srikanth Kontham | 9 July 2026 5:00 AM ISTమలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రతిభావంతురాలైన దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇప్పుడు టాలీవుడ్ పై కన్నేసినట్లు సమాచారం. తనదైన మేకింగ్ స్టైల్, ఎమోషనల్ డెప్త్ ఉన్న కథలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గీతూ పాన్-ఇండియా స్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. `టాక్సిక్` వంటి భారీ చిత్రాలతో తనకంటూ బలమైన ఇమేజ్ ఏర్పరచుకున్న గీతూ ఇప్పుడు నేరుగా తెలుగు సినిమా మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ మలయాళ స్టార్ హీరోలతో పనిచేస్తూనే తదుపరి చిత్రాల్లో తెలుగు అగ్ర నటులను భాగస్వాములను చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో కేవలం మలయాళం, హిందీ భాషలకే పరి మితమైన ఆమె చిత్రాల పరిధిని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మార్చుకోవాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లోని కమర్షియల్ ఎలిమెంట్స్ ను తనదైన ఆర్టిస్టిక్ శైలికి జోడించి కొత్త రకమైన సినిమా టిక్ అనుభవాన్ని అందించాలని యోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. గీతూ మోహన్ దాస్ క్రియేటివిటీకి, స్టార్ హీరోలకున్న మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద అద్భుతాన్ని సృష్టించే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం కథా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ గీతూ కథపై నమ్మకం ఉన్న ఆ అగ్ర నటుడు కూడా ప్రతిపాదనకు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. గీతూ మేకింగ్ లో ఉండే డార్క్ అండ్ రా శైలి, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉంది. అయితే అగ్ర నటులతో పనిచేసేటప్పుడు తనదైన ప్రత్యేకతను కాపాడుకుంటూనే మాస్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించ గలదనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గీతూ ప్రాజెక్ట్ గనుక కార్యరూపం దాలిస్తే ఖచ్చితంగా టాలీవుడ్ లో సంచలనం కానుంది.
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. గీతూ తన టీమ్ తో కలిసి ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని వినికిడి. తెలుగు మార్కెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి గీతూ వేస్తున్న అడుగు చాలా కీలకం కానుంది.
గీతూ సృజనాత్మకతకు స్టార్ హీరోల గ్లామర్ - యాక్షన్ తోడైతే తెలుగులో మెరవడం ఖాయం. ప్రేక్షకులు కూడా వైవిధ్యమైన కథలను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఆమె రాక టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. టాక్సిక్ రిలీజ్ అనంతరం ఆమె ఎంత ట్యాలెంటెడ్ అన్నది పూర్తి స్థాయిలో బయట పడుతుంది.` టాక్సిక్` బ్లాక్ బస్టర్ అయితే? తెలుగు హీరోలే ఆమె కోసం క్యూలో ఉంటారు? అనడంలో ఎలాంటి సందేహం లేదు.
