టాక్సిక్ వైరల్ బ్యూటీ ఎవరు? గీతూ క్లారిటీ ఇదిగో..
స్టార్ హీరో యశ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ గ్లింప్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 10 Jan 2026 4:30 PM ISTస్టార్ హీరో యశ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ గ్లింప్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ గ్లింప్స్ లోని ఇంటిమేట్ సన్నివేశాల్లో కనిపించిన నటి ఎవరనే అంశం వైరల్ గా మారింది. ఆ సమయంలో హాలీవుడ్ నటి నటాలీ బర్న్ పేరు ట్రెండ్ కావడంతో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇచ్చారు.
యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టాక్సిక్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. కేజీయఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఆ చిత్రం, డార్క్ అండ్ ఇంటెన్స్ టోన్ తో సాగనున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థమైంది.
అయితే గ్లింప్స్ లో శ్మశానం వద్ద కారులో చూపించిన కొన్ని బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాలు విమర్శలకు దారి తీశాయి. ముఖ్యంగా మహిళా దర్శకురాలైన గీతూ మోహన్ దాస్ ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించడంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొందరు విమర్శించగా.. ఇంకొందరు మద్దతు తెలిపారు. దీంతో గీతా మోహన్ దాస్ స్పందించారు.
"మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు తీశిందని విమర్శలు రావడం చూసి నేను చిల్ అవుతున్నాను. కథకు అవసరమైనదే తెరపై చూపించాం" అని సోషల్ మీడియాలో తెలిపారు. అదే సమయంలో గ్లింప్స్ లో యశ్ తో కలిసి కనిపించిన నటి ఎవరనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఆ సన్నివేశాల్లో నటించింది నటాలీ బర్న్ కాదని, ఆమె పేరు బీట్రీజ్ టాఫెన్ బాచ్ అని చెప్పారు.
బీట్రీజ్ టాఫెన్ బాచ్ హాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటి. ప్రముఖ టీవీ సిరీస్ బ్రూక్లిన్ నైన్-నైన్ ద్వారా ఆమెకు గుర్తింపు లభించింది. అలాగే డిస్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో కూడా ఆమె కీలక పాత్రలో నటించారు. టాక్సిక్ లో బీట్రీజ్ పాత్ర కథలో కీలకంగా ఉండనుందని సమాచారం. ఇక సినిమా విషయానికి వస్తే, యశ్ తో పాటు ఐదుగురు హీరోయిన్లు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
నదియా పాత్రలో కియారా అడ్వాణీ, ఎలిజిబెత్ పాత్రలో హ్యుమా ఖురేషీ, గంగ రోల్ లో నయనతార, రెబెకాగా తారా సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణీ వసంత్ కనిపించనున్నారు. విభిన్నమైన పాత్రలు, బోల్డ్ నేరేటివ్, ఇంటెన్స్ ప్రెజెంటేషన్ తో టాక్సిక్ కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని మేకర్స్ చెబుతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో.. ఎంతటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
