Begin typing your search above and press return to search.

'గీతాంజలి' రీ-రిలీజ్ వేళ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన నిజం!

తన సినిమాలను వీలున్న ప్రతి వేదికపైనా ప్రమోట్ చేసే నాగార్జున ఓ ఇంటర్వ్యూలో `గీతాంజలి` మూవీ సెట్స్‌పైకి వెళ్లడానికి తాను ఎంత పట్టుదలగా శ్రమించాల్సి వచ్చిందో వివరించారు.

By:  Sivaji Kontham   |   18 Jun 2026 10:45 AM IST
గీతాంజలి రీ-రిలీజ్ వేళ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన నిజం!
X

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున నట ప్రతిభను పరాకాష్టలో ఆవిష్కరించిన చిత్రం `గీతాంజలి`. నాగ్‌లోని అద్భుతమైన ప్రేమికుడిని, హృదయాలను కదిలించే భావోద్వేగ భరిత నటనను పరిచయం చేసిన ఈ సినిమాను భాషా భేదం లేకుండా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పటికీ ఉత్తరాది ప్రేక్షకుల్లో నాగార్జునకు గొప్ప ఫాలోయింగ్ ఉందంటే దానికి ప్రధాన కారణం ఆయన నటించిన శివ, గీతాంజలి చిత్రాలే. ఈ రెండు సినిమాలు రొటీన్ ఫార్ములాకు భిన్నంగా వచ్చి, ఆ రోజుల్లోనే కింగ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. ఇటీవల `శివ` రీమాస్ట‌ర్ వెర్ష‌న్‌ను రీ-రిలీజ్ చేసి బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు దర్శకుడు మణిరత్నం `గీతాంజలి` చిత్రాన్ని కూడా మెరుగుప‌రిచిన వెర్ష‌న్ ను రీ-రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో కింగ్ నాగార్జున వెల్ల‌డించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను అభిమానులు తెలుసుకుని తీరాలి.

తన సినిమాలను వీలున్న ప్రతి వేదికపైనా ప్రమోట్ చేసే నాగార్జున ఓ ఇంటర్వ్యూలో `గీతాంజలి` మూవీ సెట్స్‌పైకి వెళ్లడానికి తాను ఎంత పట్టుదలగా శ్రమించాల్సి వచ్చిందో వివరించారు. ఈ సినిమా కోసం తాను దాదాపు ఆరు నెలల పాటు దర్శకుడు మణిరత్నం చుట్టూ తిరిగానని నాగ్ గుర్తుచేసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే ఆయన ఆఫీస్‌కు చేరుకుంటే.. ఆ సమయంలో మణిరత్నం మార్నింగ్ వాక్‌లో ఉండేవారని చెప్పారు. అలా నిరంతరం పట్టుబట్టి వెంట‌ప‌డి చివరకు `గీతాంజలి` సినిమా చేయడానికి ఆయనను ఒప్పించానని నాగ్ తెలిపారు. నిజానికి మొదట ఈ చిత్రాన్ని కేవలం తమిళంలోనే చేయాలనుకున్నారని, అయితే తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకునేందుకు తెలుగు వెర్షన్ కూడా చేయాలని తానే స్వయంగా మణిరత్నానికి సూచించినట్లు నాగార్జున వెల్లడించారు.

పరిశ్రమలో నటసామ్రాట్ ఏఎన్నార్ కుమారుడిగా నాగార్జునకు ఎంతో క్రేజ్ ఉండేది. అందువల్ల ఆయన్ను పెద్ద తెరపై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆరాటపడేవారు. కానీ తాను ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వయంకృషితో ఎదగడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని నాగార్జున చెప్పారు. స్టార్ హీరో కొడుకుగా రావడం వల్ల అంచనాలు భారీగా పెరిగిపోయాయని, దాంతో కెరీర్ ఆరంభంలో కొన్ని వైఫల్యాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే ఆ తర్వాత తన సొంత నిర్ణయాలతో కొన్ని విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో నిరూపించారు.

నాగార్జున కెరీర్ లోనే `గీతాంజలి` ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ. అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన రేంజ్‌కు చేరుకోకపోవడం కొంత నిరాశ పరిచినా.. నాగార్జునకు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి భారీ అభిమాన గణం ఏర్పడింది. ఈ చిత్రంలో ప్రాణాంతక అనారోగ్యంతో మరణానికి చేరువగా ఉన్న ఇద్దరు ప్రేమికులుగా నాగార్జున, గిరిజ (గీత) నటప్ర‌ద‌ర్శ‌న న‌భూతోన‌భ‌విష్య‌తి. ఇళ‌యరాజా పాట‌లు, బీజీఎం ప్రాణం పోసాయి. మరణం ముంగిట నిలిచిన ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమను మణిరత్నం వెండితెరపై అత్యంత అందంగా, హృద్యంగా ఆవిష్కరించారు.

ఈ క్లాసిక్ హిట్ వచ్చిన మరో రెండేళ్లకు.. అంటే 1989లో నాగార్జున సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)తో కలిసి `శివ` అనే కల్ట్ క్లాసిక్ సినిమాను ప్లాన్ చేశారు. ఈ రోజుల్లో `పాన్ ఇండియా` అంటూ భారీ పబ్లిసిటీలు చూస్తున్నాం కానీ... ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేని ఆ రోజుల్లోనే కేవలం గీతాంజలి నాగార్జున‌ను పాన్ ఇండియా స్టార్ ని చేసింద‌ని అంగీక‌రించాలి.