Begin typing your search above and press return to search.

ఒక్క సినిమాతోనే ఇండ‌స్ట్రీకి గుడ్‌బై!

ఒకే ఒక్క సినిమాతో వెండితెరకు దూరమయ్యారనే విషయం ఇప్పటికీ అభిమానుల్లో ఆసక్తికరంగానే ఉంటుంది.

By:  Srikanth Kontham   |   26 Sept 2026 2:00 PM IST
ఒక్క సినిమాతోనే ఇండ‌స్ట్రీకి గుడ్‌బై!
X

2004లో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా రిలీజ్ అయిన `స్వదేస్` చిత్రంలో గీత అనే ఉపాధ్యాయురాలి పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన న‌టి గాయత్రి జోషి (గాయత్రి ఒబెరాయ్) గుర్తుండే ఉంటుంది. తొలి చిత్రంలోనే సహజసిద్ధమైన నటన, సాంప్రదాయక అందంతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నగాయ‌త్రి ఆ తర్వాత మరే సినిమాలోనూ నటించకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఒకే ఒక్క సినిమాతో వెండితెరకు దూరమయ్యారనే విషయం ఇప్పటికీ అభిమానుల్లో ఆసక్తికరంగానే ఉంటుంది.

'స్వదేస్' సినిమాకు ముందు గాయత్రి జోషి మోడలింగ్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 1999లో ఫెమినా మిస్ ఇండియా ప్యాజెంట్‌లో ఫైనలిస్ట్‌గా నిలవడమే కాకుండా, 'మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2000' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా, పలు మ్యూజిక్ వీడియోలలో నటిస్తూ మంచి ప్రజాదరణ పొందిన గాయ‌త్రి దర్శకుడు అశుతోష్ గోవారిషి 'స్వదేస్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశారు.

ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన గ్రామసీమ నేపథ్యం ఉన్న పాత్రలో గాయత్రి నటన విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఉత్తమ పరిచయ నటిగా పలు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయం తర్వాత ఆమెకు బాలీవుడ్ నుంచి అనేక పెద్ద ప్రాజెక్టులలో నటించే అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే కెరీర్ గ్రాఫ్ పీక్ స్టేజ్‌కి చేరుకుంటున్న సమయంలోనే ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సినీ గ్లామర్ కంటే వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యమిచి వెండితెరకు గుడ్ బై చెప్పారు.

2005లో ప్రముఖ వ్యాపారవేత్త, ఒబెరాయ్ రియల్టీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన వికాస్ ఒబెరాయ్‌ను గాయత్రి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత పూర్తిగా చిత్ర పరిశ్రమకు దూరమైన ఆమె భర్త , ఇద్దరు కుమారులతో కుటుంబ బాధ్యతలకే సమయాన్ని కేటాయించారు. స్టార్‌డమ్, పబ్లిసిటీ కంటే కుటుంబంతో గడిపే ప్రశాంతమైన జీవితమే ఎక్కువ సంతోషాన్ని, తృప్తిని ఇస్తుందని భావించి గాయ‌త్రి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

చాలామంది నటీనటులు వరుస అవకాశాల కోసం, లైమ్‌లైట్‌లో ఉండటం కోసం నిరంతరం పోరాడే సినీ పరిశ్రమలో గాయత్రి ఒబెరాయ్ తీసుకున్న నిర్ణయం అరుదైనది. బాలీవుడ్ వెలుగులకు దూరంగా ఉన్నప్పటికీ తన నిర్ణయం పట్ల ఆమె ఎప్పుడూ విచారం వ్యక్తం చేయలేదు. కుటుంబ సంక్షేమం, పిల్లల పెంపకంలోనే తనకు పరిపూర్ణమైన ఆనందం లభించిందని, జీవితంలో ప్రాధాన్యతలను స్పష్టంగా ఎంచుకోవడం వల్లే తాను సంతోషంగా ఉన్నానని వివిధ సందర్భాల్లో తెలిపారు.

నేటికీ `స్వదేస్` సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ గాయత్రి జోషి నటన, ఆమె పోషించిన `గీత` పాత్ర చిరకాలం గుర్తుండిపోతాయి. కేవలం ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నటీమణులలో గాయ‌త్రి ఒకరిగా నిలిచారు. గ్లామర్ మోజులో పడకుండా సొంత కుటుంబం ఇచ్చే ప్రశాంతతే గొప్పదని నిరూపిస్తూ గాయత్రి ఒబెరాయ్ సాగిస్తున్న జీవితం నిజంగా అభినందనీయం.