గౌతమ్ తిన్ననూరి మరో క్లాసిక్ అటెంప్ట్!
టాలీవుడ్ కి సరైన క్లాసిక్ లవ్ స్టోరీ డైరెక్టర్ లేడు అనుకుంటోన్న సమయంలో గౌతమ్ తిన్ననూరి రూపంలో ఓ ఆశాకిరణం ఎదురైంది.
By: Srikanth Kontham | 9 Feb 2026 10:00 PM ISTటాలీవుడ్ కి సరైన క్లాసిక్ లవ్ స్టోరీ డైరెక్టర్ లేడు అనుకుంటోన్న సమయంలో గౌతమ్ తిన్ననూరి రూపంలో ఓ ఆశాకిరణం ఎదురైంది. `మళ్లీ రావే` అనే రొమాంటిక్ డ్రామాతో తనలో క్లాసిక్ డైరెక్టర్ పరిచయం చేసాడు. అప్పటికే సుమంత్ కెరీర్ ముగిసిపోయింది. హీరోగా అవకాశాలు రాలేదు. అతడితో సినిమా తీస్తే లాభాలు రావు అన్న భయం అందరిలోనూ ఉంది. కానీ గౌతమ్ మాత్రం తాను రాసిన ఆ లవ్ స్టోరీకి సుమంత్ మాత్రమే యాప్ట్ అవుతాడని అతడి మార్కెట్ తో సంబంధం లేకుండా ఎంపిక చేసాడు. అనుకున్నట్లు గానే తాను అనుకున్న సక్సెస్ తొలి చిత్రంతోనే సాధించాడు.
సుమంత్ కెరీర్ కి ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. దర్శకుడిగా తొలి సినిమా అదే అయినా? తన రైటింగ్ మాయా జాలంతో గౌతమ్ కట్టి పేసాడు. ప్రేక్షకుల్ని ఎంతో హృద్యంగా ఆకట్టుకున్న చిత్రంగా నిలిచింది. అనంతరం నేచురల్ స్టార్ నానితో `జెర్సీ` అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేసి మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో గౌతమ్ వందశాతం సక్సెస్ అయ్యాడు. గౌతమ్ ఖాతాలో ఇది సెకెండ్ క్లాసిక్ గా నిలిచింది. అతడి ప్రతిభను గుర్తించిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ `జెర్సీ`ని హిందీలోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
అక్కడా విమర్శకుల ప్రశంసలందుకుంది. ప్రత్యేకించి టాలీవుడ్ లో క్లాసిక్ డైరెక్టర్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. మరి ఈ ఐడెంటిటీ గౌతమ్ కు నచ్చలేదో? ఏమోగానీ తనలో క్లాసిక్ యాంగిల్ ని పక్కనబెట్టి మాస్ కోణాన్ని నిద్ర లేపాడు. ఈ రెండు విజయాల తర్వాత విజయ్ దేవరకొండ `కింగ్ డమ్` అనే ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పక్కా వాణిజ్య అంశాలతో గౌతమ్ చేసిన ఓ కొత్త అటెంప్ట్ ఇది. కానీ గౌతమ్ లో మాస్ కోణం ప్రేక్షలకు అంతగా కనెక్ట్ కాలేదు. రిలీజ్ అనంతరం ఈ సినిమా తీసింది గౌతమ్ అన్న సందేహం రాక మానదు.
అయితే ఈ విమర్శను గౌతమ్ సీరియస్ గానే తీసుకున్నాడు. తన స్టైల్ క్లాసిక్ జానర్లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం `మ్యాజిక్` అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. నలుగురు టీనేజ్ స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. కాలేజీ ఫెస్ట్ కోసం ఒక ఒరిజినల్ సాంగ్ కంపోజ్ చేయాలనే లక్ష్యంతో కుర్రాళ్లు పడే తపన? వారి ప్రయాణం? ఆ క్రమంలో వారు ఎదుర్కొనే ఎమోషన్స్ కథ సాగుతుంది. ఇది 2000వ సంవత్సరం ప్రారంభంలో సాగే పీరియాడిక్ డ్రామా. `ధురంధర్` ఫేం సారా అర్జున్ మెయిన్ లీడ్ పోషిస్తోంది. మరో నలుగురు కొత్త కుర్రాళ్లను ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. దీన్ని పూర్తిగా ఓ క్లాసిక్ చిత్రంగా మలుస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం ప్రధాన బలం. మ్యూజికల్ డ్రామా కాబట్టి? సంగీతానికి పెద్ద పీట వేసారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఊటీ లాంటి బ్యూటీఫుల్ ప్రదేశాల్లోనే మేజర్ పార్ట్ జరుగుతోంది.
